ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గణేశుని పూజిస్తారు. ఇక వీధులలో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకుంటారు. ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తులపై కూడా గణపతికి వల్లమాలిన అభిమానం. ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. వినాయకుడి వాహనం మూషికం అంటారు. కానీ ఎలుకతో పాటు సింహం, నెమలి, పాము కూడా ఆయనకు వాహనాలే.
మత్సాసుర సంహారం కోసం వక్రతుండ అవతారం దాల్చి సింహాన్ని వాహనంగా చేసుకున్నాడు. కామాసురుని సంహరించడానికి వికటవినాయక అవతారం ఎత్తినప్పుడు నెమలి వాహనం అయింది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీక. అయితే, ప్రచారంలో ఉన్నది ఎలుక మాత్రమే. దీనికి అఖుడని పేరు. క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ఇది ప్రతీక. తమోరజో గుణాల విధ్వంసకారక శక్తికి సంకేతం.
ఇతరులలోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి. అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలనే స్థిరత్వానికి సంకేతం తన ఉదరం ద్వారా వెల్లడిస్తే, ఇతరులు వేసే నిందలు, దుర్భాషలను పట్టించుకోరాదని సంకేతం ఆయన పాదాలు వివరిస్తాయి. స్వామి వాహనం ఎలుక. ఎంత చిన్నదో అంతవేగంగా ప్రయాణిస్తుంది.