మనం అనేక పండగలు జరుపుకుంటాం. వాటిల్లో ప్రధానమైన పండగ సంక్రాంతి. ఈ పండగను.. భోగి, మకర సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండగ కనుమ. దీన్నే పశువుల పండగ అని కూడా అంటారు. ఈ పండగ గురించి పురాణాల్లో చాలానే కథలు ఉన్నాయి.
కనుమను పశువుల పండగగా ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన పురణాలు చెబుతున్నాయి. ఒక ఆచారంగా వస్తున్న ఇంద్రుడిని పూజించడం తగదని శ్రీకృష్ణుడు సెలవిచ్చాడు. మనం- మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతమైన ఈ గోవర్ధనగిరికి, గోవులకి పూజలు చేయాలని శ్రీ కృష్ణుడు తెలిపి.. కనుమ పండగ రోజున గోవులకు పూజలు చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు సంక్రాంతి తర్వాతి రోజును కనుమగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.
ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి. ఈ కనుమ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకూ పూజ చేయడం జరుగుతుంది. వ్యవసాయ వృత్తిలో రైతులకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞతాభావంతో ప్రేమ పూర్వకంగా పశువులను గౌరవించి.. పూజిస్తారు.
కనుమ రోజున పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నివేదిస్తారు. తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే ‘పొలి చల్లటం’ అంటారు. అంటే దాని అర్థం ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడ- పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు.
ఈ పండగలో మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో ‘కనుమ’నాడు ‘మినుములు’ తినాలనే ఆచారం. అందుకే ‘మినపగారెలు’ చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ రోజు కాకి కూడ కదలదని సామెత. కనుమనాడు తప్పక మాంసాహార విభిన్న రుచులను వండుకొని తింటారు. కనుమ పండగలో గల ఈ ప్రత్యేకతల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.