అక్షయతృతీయకు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తారు. ఇవాళ బంగారం కొంటే అది రెట్టింపు అవుతుంది అనే భావనలో ఉంటారు. అయితే అక్షయతృతీయ రోజు ఈ ఒక్క పని చేస్తే మీకు అదృష్టం వరిస్తుంది.
అక్షయతృతీయను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు చేసే పని రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని భావిస్తుంటారు. అయితే ఇక్కడ కొన్ని అపోహలు కూడా ఉంటాయి. అదేంటంటే.. అక్షయతృతీయ రోజు బంగారం కొనాలి. అలా బంగారం కొంటే అది రెండింతలు అవుతుంది. ఆ బంగారం అక్షయం అవుతుందని భావిస్తుంటారు. అయితే అలా బంగారం రెట్టింపు అవుతుందని పురాణాల్లో ఎక్కడా లేదు. కానీ, అక్షయతృతీయ రోజు చేయాల్సిన పనులను మాత్రం స్పష్టంగా చెప్పారు. అక్షయతృతీయ రోజు జపం, దానం, యాగం, నదీ స్నానం చేయాలంటూ పండితులు చెబుతున్నారు. మీరు చేసే పుణ్యకార్యాలు మీకు సత్ఫలితాలను ఇస్తాయంటూ చెబుతున్నారు.
అక్షయతృతీయ రోజు మీరు ఏ పని చేసినా అది మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెబుతుంటారు. అంటే మీరు మంచి చేస్తే అది మీకు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు తప్పు చేసినా.. ఎవరికైనా కీడు తలపెట్టినా అది కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా అక్షయతృతీయ రోజు ఉదయాన్నే లేచి నదీ స్నానం చేస్తే మంచిది. అయితే నదికి దగ్గరగా లేని వారు భక్తి శ్రద్ధలతో తలంటుస్నానం చేసి దానధర్మాలు చేయచ్చు. ఈ రోజు ఒక కుండలో నీటిని, మజ్జిగను వితరణ చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవిని పూజించేవారు.. విష్ణువుని విడగా ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు. అంటే విష్ణువుని, లక్ష్మీదేవిని కలిపి పూజించాలని సూచిస్తున్నారు.
అక్షయతృతీయ రోజు తల్లిందండ్రులకు సేవ చేసుకోవడం చాలా మంచిది. ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి. తులసి కోటలో దీపం పెట్టాలి. అయితే ఈ రోజు ఉదయం మీరు పూజ చేయడం మాత్రమే కాకుండా సాయంత్రం కూడా ఒక పని చేయాలి. అలా చేయడం వల్ల మీకు అదృష్టం, సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపారాధన చేయాలని చెబుతున్నారు. ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని సూచిస్తున్నారు. అలాగే ఈరోజు ఎలాంటి అప్పులు, తప్పులు చేయకూడదని.. పుణ్యం ఫలితం లాగానే అవి కూడా రెట్టింపు అవుతాయని హెచ్చరిస్తున్నారు.