Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ అంటే శ్రేష్ఠమైన లక్ష్మీ అని అర్ధం.శ్రేష్ఠమైన లక్ష్మీదేవి కోసం చేసే వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కీర్తి, ఐశ్వర్యం, సంపద పెరుగుతాయని చాలా మంది నమ్మకం. లక్ష్మీదేవి అంటే ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, జ్ఞాన సంపద, గుణ సంపద వంటి సంపదలను అందించే దేవత. వరలక్ష్మీ వ్రతం రోజున పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తల స్నానం చేయాలి. అనంతరం చేసి పూజ మందిరంలో ఒక మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. మండపాన్ని సిద్దం చేసుకునే ముందు పూజా సామాగ్రి, అక్షింతలు, తోరణాలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ముందు గణపతి పూజను చేయాలి. గణపతి పూజ చేసిన తర్వాతే వరలక్ష్మీ పూజ ప్రారంభించాలి.
ఈ మండపం మీద బియ్యం పిండితో ముగ్గువేసి.. కలశం ఏర్పాటు చేసుకోవాలి. కొబ్బరికాయని శుభ్రంగా కడిగి పసుపు రాసి కలశం మీద నిలబెట్టాలి. కలశంపై కొబ్బరికాయను ఉంచి దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి దానిని ఎరుపు రంగు జాకెట్ ముక్కతో అలంకరించాలి. అనంతరం కొబ్బరికాయ మీద అమ్మవారి ముఖాన్ని తయారుచేసుకోవాలి. పసుపు, బియ్యం పిండి, మైదాపిండి వీటిలో వేటితో అయినా గానీ అమ్మవారి ముఖాన్ని తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్‌లో దొరికే అమ్మవారి విగ్రహాలనయినా మండపంలో పెట్టుకోవచ్చు.
అంతా సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారిని పువ్వులు, ఆభరణాలతో అలంకరించాలి. అష్టోత్తర శత నామాలతో అమ్మవారిని కీర్తిస్తూ అర్చన చేయాలి. ఈ అర్చనలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి.. వ్రత కథను చదివి వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని అందరికీ వినిపించాలి. వరలక్ష్మీ దేవి పేరులోనే ఉంది వరం అని. ఆ తల్లిని భక్తితో కోరుకునే ఏ కోరికనైనా తీరుస్తుందని నమ్ముతారు. ఈ వ్రతం ఆచరించడానికి నియమాలు, మడులు ఏమీ లేవు. వ్రతం చేయాలన్న భక్తి, నిగ్రహం, నిష్ట ఉంటే చాలు. ఈ వరలక్ష్మీ వ్రతం చాలా పవిత్రమైనది. అందుకే చాలా నిష్టగా ఉండాలి. ఇక శ్రావణ శుక్రవారం రోజున వ్రతాన్ని ఆచరించేవారు సాయంత్రం ముత్తయిదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి తాంబూలాన్ని సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలా చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం కుదరని వాళ్ళు.. రెండవ శుక్రవారం రోజున చేసుకుంటారు. రెండో శుక్రవారం కూడా వీలు కాకపోతే మూడవ, నాల్గవ శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతం చాలా అంకితభావంతో, అత్యంత నియమ నిష్టలతో చేయాలని పండితులు చెబుతున్నారు. వ్రతం చేసే సమయంలో అస్సలు పొరపాట్లు చేయకూడదని అంటున్నారు. కొన్ని పొరపాట్లు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని నమ్ముతారు. కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
వరలక్ష్మీ వ్రతం నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. ఆ రోజున సూర్యోదయం తర్వాత లేస్తే ఫలితం ఉండదు. ఈ వ్రతం చేసుకునే సమయంలో కుటుంబ సభ్యులందరూ పూజలో పాల్గొనాలి. వరలక్ష్మీ వ్రతం మొదలుపెట్టే ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతే లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఏ దేవుని పూజ అయినా ముందు పూజ చేయవలసింది అ గణపతికే. కాబట్టి గణపతి పూజ నిర్వహించకుండా లక్ష్మీదేవి పూజ చేయకూడదు. వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కలశాన్ని గ్లాజు ప్లేట్లలో పెట్టకూడదు. అలా చేస్తే అరిష్టం అని పండితులు చెబుతారు. స్టీలు, వెండి లేదా రాగి ప్లేటులో కలశాన్ని పెట్టుకోవాలి. ఈ వ్రతం చేసేటప్పుడు చాలా సౌమ్యంగా, ఓపిగ్గా, శాంతంగా ఉండాలి. ఎవరినీ తిట్టుకోకూడదు. ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు. వరలక్ష్మీ వ్రతం అంటే చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. పైగా శుక్రవారం కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిదని పెద్దలు చెబుతారు. కోరిన వరాలు తీర్చే వరలక్ష్మీ అమ్మ వారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.