మకర సంక్రాంతి.. తెలుగు ప్రజలకు ఇదే చాలా పెద్ద పండుగ, ఎంతో విశిష్టమైనది కూడా. ఈ పండుగకు పిల్లా పెద్ద అంతా కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల నృత్యాలు, ఇంటి ముందు రంగవల్లులతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజుని భోగి అని పిలుస్తారు. ఈ భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది. మీకు భోగ భాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు పట్టిన పీడలు తొలగిపోయావాలని జరుపుకునేదే భోగి పండుగ.
ఈ పండుగ రోజు అందరూ కలిసి తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలను వేస్తారు. ఈ భోగి మంటలు వేసేందుకు వెనుకటి రోజుల్లో అయితే తాటాకులు, కొబ్బరాకులను కొన్ని రోజుల ముందే కొట్టి ఎండబెట్టిి మంటలు వేసుకుంటారు. అలాగే ఇంట్లో ఉండే పాత కలప, కొట్టేసిన చెట్ల కొమ్మలు వంటి వాటిని ఈ మంటల్లో వేస్తారు. ఈ భోగి మంటలపై నీళ్లు కాచుకుని పొద్దున్నే తలార స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు పట్టిిన పీడలు అన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా భోగి రోజు చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనకు సాధారణంగా ఒక వస్తువు పాడైతే దానిని పారేయడానికి మనసొప్పదు. వాటికి చెదలు పట్టుకుని, పురుగులు చేరి ఇల్లంతా వ్యాపస్తూ ఉంటాయి. అందుకే ఇంట్లో చెదలు పట్టిన పాత కలప వస్తువులను భోగి మంటల్లో వేయాలని చెబుతారు. ధనుర్మాసం చివరి రోజుని భోగి అంటారు. అలా పాత వస్తువులను మంటల్లో వేసి కొత్తగా ప్రారంభించాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారంటూ పండితులు చెబుతుంటారు. అయితే మారుతున్న కాలం ప్రకారం సాంప్రదాయం, సంస్కృతి కూడా మారుతూ వస్తోంది.
శాస్త్రాల్లో చెప్పినవి పక్కన పెట్టి ఎవరికి నచ్చిన విధంగా వారు పండుగలను జరుపుకుంటున్నారు. భోగిని కూడా ఇష్టారీతిన నిర్వహిస్తున్నారు. అయితే భోగి మంటల్లో ఈ 10 వస్తువులను మాత్రం అస్సలు వేయకూడదని చెబుతున్నారు. అలా వేయడం వల్ల పీడ పోవడం పక్కన పెడితే.. లేనిపోని అరిష్టం చుట్టుకుంటుందని హెచ్చరిస్తున్నారు. పుస్తకాలు, చీపురు, పీట, పలకలు, దేవుడి పటాలు, దేవుడి బొమ్మలు ఉండే సంచులు, దేవుడి ముఖాలు ఉండే గోతాలు, ప్లాస్టిక్ వస్తువులు, పాత బట్టలు, పూజ గదిలో వస్తువులు వంటి వాటిని మంటల్లో వేయకూడదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల లేనిపోని అరిష్టాన్ని కోరి తెచ్చుకున్నట్లు అవుతుందట.