ఈ సమస్త సృష్టి మనుగడ సాధిస్తుంది అంటే.. సూర్య భగవానుడి వల్లే. ఆయనే కనక లేకపోతే.. జీవ రాశి అంతరించి పోయేది. మనుషులకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుడు. మన దేశంలో ఆయనకు ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక నేడు శనివారం.. సూర్య భగవానుడికి సంబంధించి ఎంతో విషిష్టమైన రోజు. సూర్య భగవానుడి పుట్టిన రోజు, జయంతి అయిన రథ సప్తమి పర్వదినం నేడు. ఈరోజు నుంచి సూర్యుడి రథం ఉత్తర దిక్కు వైపునకు మల్లుతుందని పురాణాలు చెబుతున్నాయి. 365 రోజుల పాటు అవిశ్రాంతంగా తిరిగే సూర్యుడి రథం.. దిశ మారే రోజున రథసప్తమిగా జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది. రథసప్తమి నాడు సూర్య శక్తి చాలా అధికంగా ఉంటుంది అంటారు. ఆ శక్తిని మనలోకి ఆవాహన చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక విధినాలను కూడా సూచించారు పెద్దలు.
ఇక రథ సప్తమి నాడు తప్పకుండా ఆచరించాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. రథసప్తమి నాడు ఏం చేసినా.. చేయకపోయినా.. ఈ పనులు మాత్రం తప్పకుండా చేయాలని.. వాటిని పూర్తి చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతాయని అంటున్నారు పండితులు. మరి ఆ పనులు ఏవంటే.. రథ సప్తమి రోజున స్నానం చేసి సూర్యభగవానుని పూజించడం తప్పనిసరి. పూజ సందర్భంగా నీటిలో ఎర్రచందనం, బెల్లం, ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వండి. ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇది మీకు మీరు పని చేసే రంగంలో విజయాన్ని ఇవ్వడమే కాక కీర్తిని పెంచుతుంది.
ఇక రథ సప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు, నారింజ రంగు వస్త్రాలను దానం చేయండి. ఇవి సూర్య గ్రహానికి సంబంధించిన దానం చేయవలసిన వస్తువులు. దీని కారణంగా మీ జాతకంలో సూర్యుని స్థానం ప్రబలంగా ఉంటుంది.
ఇక రథసప్తమి నాడు నీళ్లలో ఎర్రచందనం, గంగాజల్, కుంకుమ, ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు పండితులు. దీంతో సూర్యభగవానుడు సంతోషించడమే కాక.. మీ ఆనందం, సంపద , ధాన్యాలలో పెరుగుదల ఉంటుంది అని తెలుపుతున్నారు.
రథ సప్తమి నాడు సూర్య భగవానుని పూజించేటప్పుడు, సూర్య గాయత్రీ మంత్రం లేదా కోరుకున్న ఫలితాలను ఇచ్చే మంత్రాన్ని జపించడం వల్ల.. మీ కోరుకున్న కోరికలు తీరతాయని అంటున్నారు పండితులు.
రథ సప్తమి నాడు ఈ నాలుగు పనులు చేస్తే.. మీ ఇంట సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతాన ప్రాప్తిరస్తు కలుగుతుంది అంటున్నారు పండితులు.