సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశించిన సూర్యుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని ‘ఉత్తరాయణం’ గా చెబుతుంటారు. అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు తిరిగి మకరరాశిలోకి ప్రవేశించే వరకూ గల కాలాన్ని ‘దక్షిణాయణం’ గా చెబుతుంటారు. ఈ రెండింటిలో దక్షిణాయణం కంటే ఉత్తరాయణం ఎంతో విశిష్టమైనదని అంటారు పెద్దలు.
దేవతల దృష్టిలో ఉత్తరాయణ కాలం ‘పగలు’ గా.. దక్షిణాయణ కాలం ‘రాత్రి’ గా కొనసాగుతుంది. ఈ కారణంగానే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలమని అంటూ వుంటారు. ఈ సమయంలో తలపెట్టిన శుభకార్యాలు, ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సవ్యంగా పూర్తవుతాయనీ.. మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.
అందువలన దక్షిణాయణం వెళ్లే వరకూ నిరీక్షించి, ఉత్తరాయణ కాలంలో శుభకార్యాలు ప్రారంభిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అన్నప్రాసనలు.. అక్షరాభ్యాసాలు.. ఉపనయనాలు.. వివాహాలు.. గృహప్రవేశాలు జరుగుతూ వుంటాయి. అంతే కాకుండా దైవ సంబంధమైన యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా ఉత్తరాయణ కాలంలోనే నిర్వహించబడుతుంటాయి.
ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. అందువల్లనే ఈ సమయంలో చనిపోయిన వారు పుణ్యాత్ములనీ, వాళ్లు నేరుగా స్వర్గానికి చేరుకుంటారని చెబుతుంటారు. అందుకే కురుక్షేత్రంలో తీవ్రంగా గాయపడిన భీష్ముడు.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు.. అంపశయ్యపై అలానే ఉండి ఆ తర్వాత ప్రాణం విడిచాడు. భీష్ముడికి తాను కోరుకున్నప్పుడు మరణించే వరం ఉండటంతో.. యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పటికి జీవించగలిగాడు.