ప్రతి ఏటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం సాధారణంగా జరిగే విషయమే. ఇక గ్రహణాల ఏర్పాటు గురించి శాస్త్రాలు ఓ రకంగా చెబితే.. పురణాల్లో మరో విధమైన ప్రచారం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికి.. ప్రతి ఏటా సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత దీపావళి పండుగ రోజున సూర్య గ్రహణం ఏర్పడుందని ఇది చాలా అరుదైన విషయం అంటున్నారు పండితులు. ఇక గ్రహణ సందర్భంగా సామాన్యులు, గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు. ఇక ఇవన్ని అలా ఉంచితే.. గ్రహణ సమయంలో తప్పకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం వీడిన తర్వాత.. శుద్ధి చేసి.. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే గ్రహణ సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు.. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో వివరాలు వారి మాటల్లోనే..
శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రడు, భూమి ఒకే సరళరేఖ మీదకు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక పురణాల ప్రకారం చూసుకుంటే.. క్షీర సాగర మధన సమయంలో వెలువడిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. ఆ తగువు తీర్చడం కోసం శ్రీ మహా విష్ణువు మోహిని అవతారంలో వచ్చి.. అమృతాన్ని పంచే కార్యక్రమాన్ని చేపడతాడు. రాక్షసులను మోసం చేస్తూ.. కేవలం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతాడు.. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి. ఇది గమనించిన రాహువు అనే రాక్షసుడు.. వచ్చి దేవతల మధ్యలో కూర్చొని అమృతం సేవిస్తాడు.
ఇది గమనించిన సూర్యచంద్రులు.. రాహువు చేసిన పని గురించి విష్ణుమూర్తికి తెలియచేస్తారు. ఆగ్రహించిన విష్ణువు రాహువును అంతం చేసేందుకు సుదర్శన చక్రం విసురుతాడు. దాంతో రాహువు తల తెగి.. వేరు పడుతుంది. కానీ అప్పటికే అతడు అమృతం సేవించడంతో.. మృతి చెందడు. దాంతో తల రాహువుగా.. మిగతా శరీరం కేతువగా అమరత్వం పొందుతాయి. ఇక తన గురించిన రహస్యాన్ని విష్ణువుకు తెలిపింది సూర్య చంద్రులే అని తెలుసుకోని.. వారిని మింగేందుకు ప్రయత్నిస్తారు. దాంతో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయని చెబుతారు.
ఇక గ్రహణం రోజు దేవతల శక్తి నశిస్తుందని భావిస్తారు. గ్రహణం సమయంలో సూర్యచంద్రులు అసాధారణమైన ప్రతికూల శక్తులను విడుదల చేస్తాయి అని భావిస్తారు. అందువల్ల, భక్తులపై దైవిక శక్తి ప్రభావాలకు భంగం కలిగించే ఈ ప్రతికూల శక్తులను నివారించడానికి, తగ్గించడానికి ప్రధాన దేవతామూర్తి ఉన్న ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయాలను మూసి వేయడమే కాక.. ప్రతికూల శక్తికి వ్యతిరేకంగా విగ్రహాలపై తులసి ఆకులను కూడా ఉంచుతారు. తులసి ఆకులకు హానికరమైన రేడియేషన్లను గ్రహించే సామర్థ్యం ఉన్నందున గ్రహణ సమయంలో వాటిని ప్రతికూల శక్తి నుంచి కాపాడటం కోసం అధికంగా వినియోగిస్తారు.