హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. ప్రతి పండగ వెనకా ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు – పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం. ఈసారి చాలామంది ఎకో ఫ్రెండ్లీ విత్తన వినాయకుడిని తయారు చేసేందుకు పూనుకున్నారు. ఈ ఏడాది పర్యావరణహిత గణేశ విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతీక అయిన వినాయక చవితి పండగను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచమంతా గణాలతో కూడుకుని ఉంది. అలాంటి గణాలు అన్నీకలిస్తేనే ఈ ప్రపంచం.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పరిసరాలు మరింత కాల్యుష్యం అయ్యే అవకాశం ఉన్నందున మట్టి గణపతికి భక్తులు జై అంటున్నారు. దీంతో ఎకో ఫ్రెండ్లీ విత్తన వినాయకుడిని రూపొందించి పూజించాలనే ఈ ఏడు ప్రచారం కొనసాగుతోంది. పర్యావరణ స్నేహపూర్వక గణేష్ విగ్రహాలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి. ఇంతకు ముందు కేవలం బంకమట్టి, సహజ రంగులతో తయారు చేసేవి. కానీ ఇప్పుడు మట్టి లోపల వివిధ చెట్ల గింజలతో రానున్నాయి. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆకు పచ్చ కవచాన్ని పెంచే విధంగా గణేష్ పండుగను జరుపుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు.
మరోవైపు మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీన్ని జాతీయ ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాలను బట్టి భిన్న రూపాలతో విఘ్నాధిపతిని ఆరాధిస్తారు. ఇలా అన్ని రూపాలను ఎకో ఫ్రెండ్లీగా పిల్లలూ పెద్దలూ తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
అతిత్వరలో వస్తోన్న వినాయక చవితికి మీరూ స్వయంగా వినాయకుడిని ఇలా చూసి చేసేయండి: