దేశ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు ఎంతో ప్రేమానుబంధాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. ప్రతి ఏడాది ఎక్కడ ఉన్నా ఆడబిడ్డలు తమ పుట్టింటికి వెళ్లి అన్నాదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎడాదిలో సోదర, సోదరి మద్య ప్రేమానుబంధాలు పెంచే మరో పండుగ జరుపుకుంటారు.. అదే ‘భగిని హస్త భోజనం’. ఈ పండుగ రోజున అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల ఇంటికి వెళ్లి వారు చేసిన చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు ఆమె యోగక్షేమాలు చూస్తూ.. రక్షణగా నిలుస్తామని చెబితే.. ఈ పండుగ రోజు మాత్రం వారి చేత ఎలాంటి గండాలు లేకుండా దీవెనలు పొందుతారు.
ఉత్తర భారత దేశంలో ‘భయ్యా ధూజీ’ అనే పేరుతో భగినీ హస్తభోజనం ఎంతో ప్రాచార్యం పొందింది. అసలు ఈ భగిని హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంటికి సోదరులు వెళ్లి వారు చేసిన భోజనం చేయడం. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి పండుగ వెళ్లిన రెండవరోజున ఈ పండుగ వస్తుంది. కుటుంబ ఆప్యాయతలను పెంచే ఆచారం.. ఇటువంటు ఆచారాలు.. అలవాట్లు ఉన్న హిందూ పండుగల్లో భగిని హస్తభోజనం ఒకటి. భారత దేశంలో హిందులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. రాఖీ పౌర్ణమి తర్వాత అంతగొప్ప విశిష్టత ఉన్న పండుగ భగిని హస్త భోజనం.
ప్రతి సంవత్సరం ఈ పండుగ దీపావళి తర్వాత రెండోరోజున జరుపుకుంటారు. సోదరి ఇంటికి సోదరులు వెళ్లి ఆమె చేసిన భోజనం తిని ఆమెకు నిండు మనసుతో కానుకలు సమర్పిస్తారు. ఆ రోజు తమ సోదరులు బాగుండాలని.. వారి దీర్గాయువు కలగాలని.. ఎలాంటి గండాలు కలగకుండా పూజ చేసి తన సోదరులకు భోజనం పెడుతుంది. ప్రతి సంవత్సరం దీపావళి ముగిసిన తర్వాత రెండో రోజు కార్తీక మాసంలోని శుక్లపక్షం రెండో రోజు ఈ పండుగ అన్నాచెల్లెళ్లు జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది సూర్య గ్రహణం రావడంతో భగిని హస్త భోజనం దీపావళి అయిన మూడో రోజు అంటే అక్టోబర్ 26 తేది మధ్యాహ్నం 2.42 గంటల నుంచి మొదలై అక్టోబర్ 27 మధ్యహ్నానం 12.42 గంటల వరకు ఉంది. భగిని హస్త భోజనం గురించి పురాణాల్లో ఓ కథ ఉంది.
ఒకసారి యముడు తన భటులతో మాట్లాడుతూ.. మీకు ఎప్పుడైనా కర్తవ్య నిర్వహణలో మనసుకు బాధ కలిగించే విషయం ఎదురైందా? అని అడుగుతాడు.. అప్పుడు ఓ భటుడు స్వామి భర్త ప్రాణాలు హరించే సమయంలో ఒక నవవధువు పడిన ఆవేదన మనసును కలచివేసిందని అంటాడు. ఆ విషయం విన్న యముడు సైతం బాధపడ్డా.. తన కర్తవ్య నిర్వహణ చేయాల్సిందే అన్ని చెబుతాడు. ఎవరైనా కార్తీక శుద్ద విధియ నాడు సోదరికి బహుమానాలు ఇచ్చి, ఇమె చేతితో తిలకం దిద్దంచుకొని.. ఆమె చేతి వంట తింటే అప మృత్యువును నివారించవొచ్చు.. యమగండాలు తొలగిపోతాయని అంటాడు.
సూర్యుని సంతానం యముడు, యమున. తన సోదరి యమునుపై ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో.. ఆమెచే ఆశీర్వదించబడుతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చారట యముడు. ఒకప్పుడు ఉత్తర భారత దేశంలో ఈ పండుగ ఎక్కువగా జరుపుకునేవారు.. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రల్లో కూడా జురుపుకుంటున్నారు.