ఈ మధ్య కాలంలో ప్రేమ మైకంలో కొందరు యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితంలో ఎంతో ఉన్నతస్థాయికి ఎదగాల్సిన యువత పెడదోవ పడుతున్నారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలో అమ్మాయిలు కూడా ఉండటం గమన్హారం. తాజాగా పోలీసు ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి ప్రేమ మత్తులో ప్రియుడి కోసం చేసిన ఓ పని ఆమె జీవితాన్నే నాశనం చేసింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… తమిళనాడు విల్లుపురం జిల్లా సెంజి ఆలంపూడి గ్రామానికి చెందిన మాధవి అనే వైద్యురాలు పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఈమె పుదుచ్చేరి టీఆర్ నగర్ లోని లేడీస్ హాస్టల్ లో ఉంటూ రోజూ విధులకు హాజరవుతుండేది. అయితే మాధవి పక్క రూమ్ లో శివప్రతీక(21) అనే యువతి ఉండేది. ఈ నెల18న మాధవి.. తన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరైంది. తిరిగి వచ్చిన అనంతరం వేసుకున్న 12 సవర్ల నగలను తన గదిలోని లాకర్ లో భద్రపరిచి విధులకు వెళ్లింది. సాయంత్రం వచ్చి చూడగా లాకర్ లో పెట్టిన నగలు కనిపించలేదు. దీంతో ఉరులైయన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
పక్కరూమ్ లో ఉండే శివప్రతీక ప్రవర్తన అనుమానంగా ఉండటంతో పోలీసులు ఆమెను విచారించారు. అసలు నిజం ఒప్పుకున్న ఆమె నుంచి పది సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా.. మిగిలిన రెండు సవర్ల నగలను విక్రయించగా వచ్చిన డబ్బును తన ప్రియుడితో కలిసి జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
విచారణలో శివప్రతీక తమిళనాడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది. ఈ యువతి ఒక యువకుడిని ప్రేమించగా, ఆ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో తల్లిదండ్రులను వదిలి వచ్చిన ఈ యువతి లేడీస్ హాస్టల్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి జల్సాలకు అలవాటు పడి.. చివరికి జైలు పాలైంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.