చాలా మంది పాలసీలు కడుతుంటారు. పాలసీ కట్టిన వారు సడన్ గా చనిపోతే నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు బీమా వస్తుంది. అయితే కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి చావు తెలివితేటలు చూపిస్తున్నారు. బతికుండగానే చనిపోయినట్టు నాటకం ఆడి బీమా సంస్థలను మోసం చేయాలని చూస్తున్నారు. తాజాగా ఓ ముఠా చావు తెలివితేటలు ఉపయోగించి ఎల్ఐసీ నుంచి రూ. 2 కోట్లు నొక్కేద్దాం అనుకుంది. కానీ చివరకు ఒక తప్పు వల్ల దొరికిపోయింది.
బీమా డబ్బుల కోసం బతికున్న మనుషులని చంపేసిన సంఘటనలు చూసాం. చనిపోయారని నమ్మించి బీమా కంపెనీలను మోసం చేసిన ఘటనలు చూశాం. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు చెందిన దినేష్ టక్సలే (29) ఇంజనీరింగ్ డిప్లోమా పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తక్కువ ఆదాయం వస్తుండడంతో ఏదో మాయ చేసి డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు. ఎల్ఐసీని మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఇద్దరు స్నేహితుల సహాయం తీసుకున్నాడు. ముందు రూ. 8 కోట్ల బీమా కోసం ప్రయత్నించాడు. కానీ రూ. 2 కోట్ల బీమా మాత్రమే ఎల్ఐసీ అధికారులు ఇచ్చారు. ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకున్నాడు. నకిలీ ఆదాయ ధ్రువ పత్రాలను సృష్టించి రూ. 2 కోట్ల పాలసీకి దరఖాస్తు చేసుకున్నాడు.
వ్యవసాయం ద్వారా ఏటా రూ. 38 లక్షలు, క్యాంటీన్ ద్వారా రూ. 3 లక్షలు ఆదాయం వస్తుందని నమ్మించి 2015 జూలై 5న దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును ఆమోదించిన ఎల్ఐసీ 35 ఏళ్లకు గాను రూ. 2 కోట్ల పాలసీని జారీ చేసింది. మొదటి ప్రీమియంగా రూ. 1.46 లక్షలు చెల్లించాడు. అలా తను దాచుకున్న రూ. 5 లక్షలను ప్రీమియంగా కడుతూ వచ్చాడు. కట్ చేస్తే 2017 మార్చి 14న దినేష్ తల్లినని చెప్తూ నందా భాయ్ టక్సలే అనే మహిళ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన కొడుకు 2016 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం గుర్తు తెలియని శవం కోసం గాలించారు. చివరకు అహ్మద్ నగర్ లోని ఓ ఆసుపత్రిలో ఒక మృతదేహాన్ని చూపించి తమ కొడుకుదే అంటూ ఓ వృద్ధ జంట వైద్యులకు చెప్పి తీసుకెళ్లారు.
మృతదేహానికి దహన సంస్కారం చేసి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. దాన్ని ఎల్ఐసీ అధికారులకు చూపించి బీమా సొమ్ము ఇప్పించమని అడిగారు. పాలసీ కట్టిన ఏడాదిలోనే వీరు రావడంపై ఎల్ఐసీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టడంతో దినేష్ బతికే ఉన్నాడని తెలిసింది. దీంతో ఎల్ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దినేష్, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులను, వృద్ధ జంటను అరెస్ట్ చేశారు. అయితే వృద్ధ జంట ఎవరు? మరణించిన వ్యక్తి ఎవరు? ఏ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధం ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎల్ఐసీ కళ్ళు కప్పి రూ. 2 కోట్లకు స్కెచ్ వేసిన దినేష్ అండ్ గ్యాంగ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.