Viral Video: రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం నశిస్తోంది. కొందరు వ్యక్తులు డబ్బు కోసం బరితెగిస్తున్నారు. దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, అప్పు కట్టలేదని ఓ వ్యక్తిపై దారుణానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. స్కూటరుకు కట్టేసి నడి రోడ్డుపై పరిగెత్తించారు. ఈ సంఘటన ఒరిస్సాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, కటక్‌కు చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. అయితే, తిరిగిస్తానన్న సమయంలో అతడు తిరిగి ఇవ్వలేకపోయాడు.
ఎన్ని సార్లు అడిగినా అప్పు తిరిగి ఇవ్వకపోవటంతో అప్పు ఇచ్చిన వ్యక్తి యువకుడిపై పగ పెంచుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి తన మిత్రుడితో కలిసి ఆదివారం యువకుడి ఇంటి దగ్గరకు వెళ్లాడు. చివరి ప్రయత్నంగా యువకుడిని తన అప్పు తిరిగి ఇవ్వాలని అడిగాడు. యువకుడు ఇప్పుడు కట్టలేనని, తర్వాత ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడ్ని తాడుతో తన స్కూటర్‌కు కట్టేశాడు. రాత్రి 11 గంటల సమయంలో సిటీ షెల్టర్ చాక్ నుంచి మిషన్ రోడ్డు వరకు లాక్కెళ్లాడు. స్కూటరు వేగంగా వెళుతుంటే.. ఆ యువకుడు దాని వెనకాల పరిగెత్తాడు.
రోడ్డుపై వెళుతున్న కొంతమంది దీన్నంతా వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
#WatchVideo l Youth tied to scooter dragged along road in #Odisha pic.twitter.com/2idf9dAMrI
— Prameya English (@PrameyaEnglish) October 17, 2022