అమ్మాయికి రక్షణ అనేది లేకుండా పోయింది. అబ్బాయి పక్కనే తోడుగా ఉన్నా కూడా కామాంధులు వదలడం లేదు. అమ్మాయి పక్కన స్నేహితుడు ఉన్నా, తండ్రి ఉన్నా, భర్త ఉన్నా, కాబోయే భర్త.. ఎవరున్నా సరే కొంతమంది దుర్మార్గులు వదిలిపెట్టడం లేదు. వాళ్ళని కొట్టైనా సరే అమ్మాయి మీద లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా కాబోయే వధూవరులిద్దరూ ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుందామని ఒక ప్రదేశానికి వెళ్లారు. అక్కడ కొంతమంది గాలి వెధవలకి అమ్మాయిని చూడగానే దుర్బుద్ధి పుట్టింది. అంతే అమ్మాయి దగ్గరకి వెళ్లి నీచంగా ప్రవర్తించారు. వదిలేయమని బతిమిలాడినా గానీ వదల్లేదు ఆ దుర్మార్గులు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని సొరాన్ ఏరియాకి చెందిన యువకుడికి, మౌయిమా అనే ప్రాంతానికి చెందిన యువతికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వివాహం చేయాలని ఇరువురి కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారు. అయితే బుధవారం కాబోయే భార్యను చూసేందుకు యువకుడు మౌయిమా వెళ్ళాడు. మనసు విప్పి మాట్లాడుకునేందుకు, ప్రైవసీ కోసం ఇద్దరూ ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. కొందరు యువకులు అక్కడికి వచ్చారు. యువతి చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాదు ఆ యువతి ఒంటిపై ఉన్న దుస్తులను కూడా లాగేందుకు యత్నించారు. తమకు నిశ్చితార్ధం జరిగిందని, ఆమె తన భార్య అని, తమని వదిలేస్తే వెళ్లిపోతామని కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు.
అయినా కూడా ఏ మాత్రం జాలి, కనికరం లేకుండా యువతి పట్ల నీచంగా ప్రవర్తించారు. తమని వదిలేయమని యువతి వేడుకుంటున్నా కూడా ఆమెను వేధించారు. ఇదంతా మరో దుర్మార్గుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరి కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతున్నా కూడా అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన దుర్మార్గులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.