ఏ వివాదమైనా, వైరమైనా డబ్బుతో ముడిపడి ఉంటుందనడం అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఎన్నో నేరాలు ఆర్థిక సంబంధాలు ఉన్నవే. ఆస్తి తగాదాలు, పొలం గొడవలు, వంశపారంపర్య ఆస్తులు ఇలా ఎన్నో విషయాల్లో సొంత బంధువులు, తోబుట్టువులను కూడా కడతేర్చిన వారిని చూశాం. అలాంటి హత్యలు కొన్నిసార్లు క్షణికావేశంలో కూడా జరుగుతుంటాయి. కానీ, ఈ హత్య మాత్రం అలా జరిగింది కాదు. పక్కా క్లారిటీతోనే చేశాడు.
ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మాత్రం ఓ యువకుడు ‘అవును మా బాబాయిని నేనే చంపా.. నేనేం పారిపోలా’ అంటూ అందరినీ ఒకింత ఆశ్చర్యం, ఒకింత భయాందోళనకు గురి చేశాడు. కనిగిరి మండలం యడవల్లికి చెందిన వెంకటేశ్వరరావుకు.. అదే ఊరిలో ఉండే ఆయన రెండో అన్న వెంకట నారాయణ కుటుంబంతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వారం క్రితం కనిగిరిలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. అధికారులు వచ్చి విచారణ చేశారు.
ఈ ఘటనతో ద్వేషం పెంచుకున్న వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మద్యం తాగుదామంటూ వెంకటేశ్వరరావును పుల్లారావు పెదారికట్ల తీసుకెళ్లాడు. మద్యం తాగాక కావాలని వెంకటేశ్వరరావుతో గొడవ పెట్టుకొని సీసా పగులగొట్టి గొంతులో పొడిచి చంపాడు. తానే చంపానంటూ నిర్భయంగా చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు పుల్లారావు. పరారీలో ఉన్న పుల్లారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.