ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేయడం అనేది మామూలే. తనిఖీలు చేసినప్పుడు వాహనదారులు పోలీసులకు సహకరించాలి. అంతేగానీ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెద్ద కేసే అవుతుంది. ఒక యువకుడ్ని ట్రాఫిక్ పోలీస్ ఆపినందుకు అతన్ని కారు బానెట్ పై ఎక్కించుకుని 20 కిలోమీటర్లు లాక్కెళ్లాడు.
ఓ వ్యక్తి కారులో వస్తున్నాడు. డ్రగ్స్ తీసుకున్నాడన్న అనుమానంతో ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కారు యజమాని పోలీస్ కి దొరక్కుండా ఉండడం కోసం కారుని వేగంగా పోలీస్ మీదకు పోనిచ్చాడు. ఆ ట్రాఫిక్ పోలీస్ తనను తాను రక్షించుకునేందుకు కారు బానెట్ ను పట్టుకుని ఉన్నాడు. అలా 20 కిలోమీటర్ల దూరం వరకూ ట్రాఫిక్ పోలీస్ ని ఆ వ్యక్తి బానెట్ పై తీసుకెళ్లాడు. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు కానిస్టేబుల్ ఆ బానెట్ మీదనే ఉండిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుక జరిగింది. ఈ అవార్డు ప్రధానోత్సవానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
అయితే కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కోపర్ ఖేరాణే-వాశీ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సిద్దేశ్వర్ మాలి (37) అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్లూ డైమండ్ సిగ్నల్ వద్ద ఓ కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే కారులో ఉన్న వ్యక్తి ఆపకుండా ముందుకు పోనివ్వడంతో ట్రాఫిక్ పోలీస్ కారు బానెట్ పైనే ఉండిపోయాడు. అయినా కూడా కారులో ఉన్న వ్యక్తి ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ప్రాణ భయంతో కానిస్టేబుల్ కారు బానెట్ ను గట్టిగా పట్టుకున్నాడు. 20 కిలోమీటర్ల దూరం, 15 నుంచి 20 నిమిషాల పాటు బానెట్ పై ట్రాఫిక్ పోలీస్ ను తీసుకెళ్లిన కారుకి గవ్హాన్ ఫాటా ప్రాంతం వద్ద బ్రేకులు పడ్డాయి.
ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కారుని వెంబడించి ఒక కంటైనర్ ను అడ్డుపెట్టి కారుని బ్లాక్ చేశారు. దీంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కారును వెంబడించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య బెండె (23) అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు తేలింది. గంజాయి తీసుకున్న యువకుడిపై హత్యాయత్నం కేసు, ర్యాష్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.