అతని పేరు జంగ దయాకర్ రెడ్డి. హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2014-18లో ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదివాడు. కానీ దయాకర్ రెడ్డికి అమెరికా వెళ్లి చదువుకోవాలని ఓ కోరిక ఉంది. కానీ బీటెక్ లో మాత్రం 11 బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ లు ఉన్నాయి. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైన సరే అమెరికా వెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ సరికొత్త మార్గాన్ని అన్వేశించాడు.
ఇందుకోసం తన స్నేహితుల ద్వారా వనస్థలిపురంలోని ఓ స్వామి అనే వ్యక్తిని కలిసి.. నేను అమెరికా వెళ్లాలనుకుంటున్నానని, కానీ బీటెక్ లో ఫెయిల్ అయ్యానని చెప్పాడు. దయాకర్ మాటలు విన్న స్వామి.. సరే నీకు నకిలీ ఓయూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇస్తానని, అందుకు గాను రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపాడు. దీంతో డైలమాలో పడ్డ దయాకర్.. మొత్తానికి స్వామితో రూ.1.30 బేరం కుదుర్చుకున్నాడు. దయాకర్ ఆ మొత్తం డబ్బులను గతేడాది ఆగస్టులో ఫోన్ పే ద్వారా ముట్టచెప్పాడు. ఇక కొన్ని రోజులు ఆగిన దయాకర్ స్వామికి ఫోన్ చేసి సర్టిఫికేట్ గురించి అడిగాడు. నేను అమెరికాలో ఉన్నానని కాస్త ఆలస్యమైందని చెప్పి దయాకర్ అడ్రస్ తీసుకున్నాడు.
ఇక కొన్ని రోజుల తర్వాత స్వామి అతనికి ఓలా రైడర్ తో నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ను దయాకర్ ఇంటికి చేర్చాడు. ఆ తర్వాత దయాకర్.. అమెరికాలో కొన్ని యూనివర్సిటీల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ పాస్ పోర్ట్ కార్యాలయాల్లో నకిలీ సర్టిఫికేట్ పెట్టి వీసా కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. కానీ అందులో దయాకర్ ఫెయిల్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే నకిలీ సర్టిఫికేట్ దందా సమాచారం తెలుసుకున్న ఎల్బీ నగర్ స్పెషల్ పోలీసులు, నాచారం పోలీసు కలిసి దయాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
అనంతరం అతని వద్ద ఉన్న నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్, ఇతర బ్యాంకు రుణాల పత్రాలు, ఓ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వామిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే స్వామి.. పేస్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో ఎంబీఏ చదివేందుకు గతేడాది నకిలీ సర్టిఫికేట్ తో అమెరికా వెళ్లాడని తెలుస్తోంది. అలా నకిలీ సర్టిఫికేట్లతో అమెరికా చెక్కేసిన స్వామి ఇలా ఎంతో మందిని బురిడి కొట్టించి నకిలీ సర్టిఫికేట్ల పేరుతో దందాను నిర్వహిస్తూ డబ్బులు కూడబెడుతున్నాడు.
స్వామి ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో విచారణ ఆలస్యం అవుతుందని, అతనిని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. స్వామి నకిలీ దందాలో ఓయూలోని కొందరి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారుతోంది. ఇలా ఫేక్ సర్టిఫికేట్లతో దందాను నిర్వహిస్తున్న ఇతగాడి నిర్వాకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.