ఎన్నో ఆశలతో బ్యాట్మింటన్ ఆటలో ఆరితేరిన యువతి.. జాతీయస్థాయిలో ఆడాలనే లక్ష్యం ఉన్నప్పటికీ కుటుంబం పరిస్థితి చూసి సాధ్యం కాదని అర్ధంచేసుకుంది. ఓవైపు అమ్మ, నాన్నమ్మలకి అనారోగ్యం.. మరోవైపు కుటుంబాన్ని పట్టించుకోని తండ్రి. ఈ పరిణామాలన్నీ చూసేసరికి కోరుకున్న భవిష్యత్ కష్టమేనని భావించిన యువతి.. మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన యానంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యానంలోని స్థానిక జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన దండుప్రోలు ధర్మారావుకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమార్తె ఆదిలక్ష్మి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ప్రైవేటు జూనియర్ కాలేజిలో ఇంటర్ చదువుతుంది. 2019, 2020 లో ఎస్జీఎఫ్ఐ సబ్ జూనియర్ నేషనల్స్ పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో అమ్మకి, నాన్నమ్మకి ఆరోగ్యం బాగాలేదు. వారికి మందుల కోసం డబ్బులు అధిక మొత్తంలో కావల్సి వస్తోంది. చేపల వ్యాపారం చేసే తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఆదిలక్ష్మి ఎక్కువగా అమ్మ, నాన్నమ్మల గురించి ఆలోచిస్తూ భవిష్యత్ మీద బెంగతో ఆత్మహత్యకు పాల్పడింది.సోమవారం తెల్లవారుజామున బ్యాట్మింటన్ ఆడేందుకు వెళ్లాల్సిన ఆదిలక్ష్మి.. దేవుడి గదిలోకి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో ఆమె అక్క ధనకుమారి వెళ్లి చూసింది. అక్క వెళ్లేసరికి ఆదిలక్ష్మి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జీవితంలో ఎదురైన కష్టాలకు భయపడి చక్కని భవిష్యత్ ఉన్న ఈ యువక్రీడాకారిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అందరిని కలచివేసింది.
ఆదిలక్ష్మి చనిపోయే ముందే అక్క ధనకుమారికి వాట్సాప్ ద్వారా.. ‘అక్క.. నాకు వెళ్లాలని లేదు.. భవిష్యత్ ఏమవుతుందోనని భయంగా ఉంది. నా వల్ల కాదు. ఐయం సారీ, కుటుంబాన్నీ నువ్వే చూసుకోవాలి. బై అక్క..’ అని చివరి సందేశం పంపినట్లు సమాచారం. ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఆదిలక్ష్మి రాబోవు జనవరిలో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతోందని ఆమె స్నేహితులు తెలిపారు. మరి కుటుంబ సమస్యలకు భయపడి తొందరపాటుతో బలవన్మరణానికి పాల్పడుతున్న ఇలాంటి విద్యార్థులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.