ప్రేమ.. ఈ మధ్యకాలంలో ఈ పదానికి కాస్త వెయిటేజీ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ఆ బంధాన్ని స్వార్థానికి వాడుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అవసరాల కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం ప్రేమ అనే రెండక్షరాల పదాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇంకొందరైతే ప్రేమ అనే ముసుగులో ఎన్నెన్ని దారుణాలకు ఒడిగడుతున్నారో వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం అందుకు భిన్నమైన ఘటన. ప్రేమించిన వాడిని పెళ్లిచేసుకోలేక, పెళ్లిచేసుకున్న వాడితో జీవించలేక ఓ యువతి తీసుకున్న దారుణమైన నిర్ణయం.. రెండు నిండు ప్రాణాలను బలిగొనింది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురానికి చెందిన నలంద(23)ని.. యాదగిరిగుట్ట దేవస్థానం ఉద్యోగి యాదగిరికి ఇచ్చి వివాహం జరిపించారు. మూడేళ్ల క్రితం వివాహం జరిగినా కూడా.. నలంద ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటూ ఉండేది. అప్పుడప్పుడు అత్తగారింటికి వెళ్తూ ఉండేది. ఆమె భర్తకు దూరంగా ఉండటానికి బలమైన కారణమే ఉంది. ఆమె పెళ్లికి ముందే బస్వాపురానికే చెందిన ఉడుత గణేశ్(25)ను ప్రేమించింది. ఇద్దరూ బంధువులే అయినా కూడా.. వారి గోత్రాలు ఒక్కటే అని పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. వారి వివాహం విషయంలో చాలా గొడవలే జరిగాయి. తర్వాత నలందకు యాదగిరితో వివాహం నిశ్చయం చేశారు. వారి పెళ్లి కూడా జరిగిపోయింది.
అయితే గణేశ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. మూడేళ్లలో నలంద అత్తగారింటికి బంధువుగానే వెళ్తూ వస్తోంది. అయితే ఓరోజు నలంద- గణేశ్ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. కలిసి జీవించలేని వాళ్లు.. కలిసి చచ్చిపోవాలని నిశ్చయించుకున్నారు. యాదగిరి డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి నలంద ఇంట్లో లేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేక్రమంలో గణేశ్ కూడా ఇంట్లో లేడనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. బుధవారం ఉదయం బాహుపేట సమీపంలోని ఆలేరు- వంగపల్లి రైల్వేస్టేషన్ మధ్య పట్టాలపై రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గణేశ్ సెల్‌ఫోన్ ఆధారంగా మృతులు నలంద- గణేశ్‌గా గుర్తించారు. మృతదేహాలకు భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు.