తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న మహిళ చాలా ఆస్పత్రులకు వెళ్లింది. పైసలు ఖర్చు అయినై కానీ.. తలనొప్పి మాత్రం తగ్గలేదు. దాదాపు రెండు నెలలుగా తీవ్ర తలనొప్పితో ఆమె పడుతున్న బాధను చూడలేని ఇరుగుపొరుగు వారు.. ఇలా అయితే కాదు గానీ.. ఒక పూజారి ఉన్నాడు, అతని వద్దకు వెళ్లు నీ తలనొప్పి మాయమైపోతుంది అన్నారు. వాళ్ల మాటలు విని నమ్మకంతో ఆ పూజారి వద్దకు వెళ్లిందా మహిళ. పూజారి చేసిన కొట్టుడు వైద్యానికి మహిళ ప్రాణాలే పోయాయి.. ఈ దారుణం కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది.
బెంగళూరుకు చెందిన పార్వతి అనే మహిళ గత రెండు నెలలుగా తలనొప్పి సమస్యతో బాధపడుతోంది. నగరంలోని పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా నొప్పి తగ్గలేదు. ఇది డాక్టర్లకు అంతుబట్టే విషయం కాదని, గాలి సోకడం వల్లే ఇలా అవుతుందని ఆమెకు తెలిసిన వాళ్లలో ఒకరు చెప్పారు. ఈ సమస్యకు హసన్ జిల్లా చెన్నరాయపట్న సమీపంలో ఉన్న బెక్కా గ్రామంలోని ఒక ఆలయ పూజారి మనూ పరిష్కారం చెప్తారని అన్నారు. దీంతో పార్వతి పూజారిని సంప్రదించింది. ఆమెకు నయం చేస్తానని చెప్పి.. చికిత్సలో భాగంగా చెరకు గడతో కొట్టాల్సి వస్తుందని.. తట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని పార్వతికి పూజారి మనూ చెప్పాడు.
ఆమె అంగీకరించడంతో చెరక గడతో ఆమె శరీరంపై, చేతులుకాళ్లు, తలపై కొట్టాడు. కొన్ని దెబ్బలు కొట్టగానే ఆమె కొంతసేపటికి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హుటాహుటిన హసన్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించగా డిసెంబర్ 8న ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి పూజారి మనూ కనిపించకుండాపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పార్వతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో ఆమె చనిపోవడానికి కారణంపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. మనూపై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతికి పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు. దారుణంగా నాటువైద్యాన్ని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: స్టూడెంట్ పై మనసుపడ్డ ఫిజిక్స్ మాస్టారు.. ఇంతలోనే షాక్!