వాట్సాప్ డీపీ ఓ మహిళ కొంప ముంచింది. ఆ డీపీ కారణంగా ఆమె చేసిన నేరం బయటపడింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం సర్వసాధారణం అయ్యింది. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ఫోన్ వాడుతూనే ఉన్నారు. త్వరితగతిన సమాచారం చేరవేయుటకు సెల్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతోంది. అంతేకాదు! సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది తీసుకున్న సెల్ఫీలు, ఫొటోలు.. వాట్సాప్ డీపీగానో, ఇన్స్ స్టాలో పోస్ట్‌గానో పెడుతూ ఉన్నారు. ఇదే కొన్ని సార్లు సదరు వ్యక్తుల్ని ఇబ్బందుల్లో పడేస్తోంది. తాజాగా, డీపీలో పెట్టుకున్న ఫొటో కారణంగా ఓ మహిళ అరెస్ట్ అయింది. ఆ మహిళ రూ.60 లక్షల విలువైన నగలు చోరీ చేసిన విషయమే కాకుండా అనేక విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని టిటి నగర్ నిషాత్ కాలనీలో డా. భూపేంద్ర శ్రీవాస్తవ నివాసముంటున్నాడు. అతనికి ప్రైవేట్ ఆస్పత్రి ఉంది. తన ఇంట్లో విలువైన నగలు, డబ్బు చోరీ జరిగిందని కొన్ని నెలల క్రితం భూపేంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తన పనిమనిషిపై అనుమానంతో 20 రోజుల క్రితమే తొలగించామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డాక్టర్ భూపేంద్ర భార్య దగ్గర పనిమనిషి నెంబర్ ఉండడంతో వాట్సప్ డీపీ ఫొటోను చూసింది. ఫొటోలో పనిమనిషి చెవులకు ఉన్న చెవిపోగులు తనవేనని డాక్టర్ భార్య గుర్తించింది. లాకర్ చెక్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు పనిమనిషిని అదుపులోకి తీసుకుని విచారించారు.
చివరకు ఆ పనిమనిషి డాక్టర్ ఇంట్లో చోరీ చేశానని ఒప్పుకుంది. పోలీసులు నిందితురాలి వద్ద నుండి రూ.60 లక్షల విలువైన నగలు, వస్తువులతో పాటుగా ఐదున్నర లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలైన పనిమనిషి డాక్టర్ ఇంట్లో పని చేస్తూ నెలకు రూ.8 వేలు సాలరీ తీసుకునేది. తన భర్త ఆదాయం నెలకు రూ.15 నుండి 20 వేల వరకు వస్తుంటుంది. కానీ ఇంట్లో ఏసీ, సీసీ కెమెరాలతోపాటు అన్ని సౌకర్యాలు ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇటువంటి విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారని, వారికి సంపాదనకు మించిన ఆస్తులు ఎక్కడివన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.