కుటుంబాల్లో చోటుచేసుకుంటున్న కలహాలు తీవ్ర విషాదానికి దారితీస్తున్నాయి. పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు చిన్న చిన్న కారణాలతో జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు.
కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితుల వల్ల వచ్చే సమస్యలు కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మహిళలను అదనపు కట్నం కోసం వేధించడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. అత్తింటి వేధింపులు, భర్త వేధింపులతో విసుగెత్తిపోయి తనువు చాలిస్తున్నారు మహిళలు. వీరి మధ్య గొడవలు పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్ పేట లో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. దీనికి సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేష్, సౌందర్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం తీసుకు రావాలని భార్యను వేధించేవాడని స్థానికులు తెలిపారు. బన్సీలాల్ పేటలో ఉన్న డబుల్ బెడ్ రూంను తన పేరు మీద రాయాలని, అలాగే యాదాద్రిలో తన భార్య పేరు మీద ఉన్న ప్లాట్ ను తన పేరు మీద రాయాలని గణేష్ ఒత్తిడి చేసేవాడని తెలిపారు. అంతే కాకుండా భార్యను పెళ్లైన తరువాత లావయ్యావని, అందంగా లేవని అంటూ సూటిపోటు మాటలతో వేధించేవాడని వెల్లడించారు.
ఈ వేధింపులు భరించలేని సౌందర్య బన్సీలాల్ పేటలోని డబుల్ బెడ్ రూం సముదాయం ఎనిమిదో అంతస్తు నుంచి కవల పిల్లలను తోసేసి తాను దూకేసింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లిదండ్రులు పెళ్లి సమయంలో గణేష్ కు రెండు లక్షల కట్నం ఇచ్చామని, యాదాద్రిలో తమ కూతురు పేరున ఉన్న భూమిని కూడా గణేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.