పెళ్లయి రెండేళ్లు.. ఇద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ఆ జంటకు ఓ పండంటి బాబు పుట్టాడు. ఆ బాబును చూసుకుని మురిసిపోతూ.. ఈ జన్మకు ఇది చాలు అనుకుంది ఆ ఇల్లాలు. అయితే, భర్త మాత్రం బరి తెగించాడు. పరాయి మహిళల మీద మోజుతో భార్యను హింసించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని కొట్టేవాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు తన బిడ్డను కూడా తీసుకుని చెరువులో దూకి చనిపోయింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని హోస్‌కోటేలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి తల్లిదండ్రలు తెలిపిన వివరాల మేరకు..
కర్ణాటకలోని హోస్‌కోటె, కల్‌కుంటే గ్రామానికి చెందిన శ్వేతకు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. శ్వేత తల్లిదండ్రులు పెద్ద మొత్తం కట్నం ఇచ్చి ఈ పెళ్లి జరిపించారు. తమ కూతురు ఎలాంటి ఇబ్బందిలేకుండా సంతోషంగా ఉంటే చాలని మురిసిపోయారు. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపరం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. రాకేష్‌కు పెళ్లికి ముందే పలువురితో అక్రమ సంబంధాలు ఉండేవి. ఈ విషయం తెలిసిన శ్వేత నిలదీయటంతో గొడవలు మొదలయ్యాయి. పెద్దల పంచాయతీ కూడా జరిగింది. ఇలా గొడవలు జరుగుతున్న సమయంలోనే దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు.
బిడ్డ పుట్టిన తర్వాతనైనా భర్త మారతాడని భావించింది. అయినా ఆయన మారలేదు. పైగా అదనపు కట్నం తేవాలంటూ హింసించటం మొదలుపెట్టాడు. రోజురోజుకు ఈ వేధింపులు ఎక్కువవుతూ వచ్చాయి. దీంతో శ్వేత భరించలేకపోయింది. ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. తాను చనిపోతే భర్త తమ కుమారుడ్ని సరిగా చూసుకోడని భావించింది. కుమారుడితో పాటు ఊరి చివర ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్వేత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.