జ్యోతి బెంగళూరులోని చామరాజపేటలో నర్సుగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు విజయ్ కుమార్ అనే యువకుడితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
‘నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కడానికి వీల్లేదు’ ప్రస్తుత సమాజంలో మెజార్టీ మనుషుల ఆలోచనా విధానం ఇది. ముఖ్యంగా నేర స్వభావం కలిగిన వారు ఈ ఆలోచనల్ని ఆచరణలో పెడుతూ ఉన్నారు. తమకు దక్కని వాటిని ఎవ్వరికీ దక్కకుండా చేస్తూ ఉన్నారు. అది మనుషులు అయినా సరే. తాజాగా, ఓ నర్సు తనను కాదని వేరే పెళ్లి చేసుకున్న ప్రియుడిపై దారుణానికి ఒడిగట్టింది. అతడిపై వేడి నీళ్లు పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక కలబురిగి జిల్లా అఫ్జల్పుర్కు చెందిన జ్యోతి దొడ్డమని బెంగళూరులో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు విజయ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం అయింది. విజయ్‌కుమార్ చామరాజపేటలోని ఓ బట్టల కంపెనీలో ఫొటో ఎడిటర్‌గా పని చేస్తున్నాడు.
ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక, అప్పటినుంచి ఇద్దరూ ఏకాంతంగా కలుసుకునేవారు. దాదాపు గత ఐదేళ్లుగా రిలేషన్లో ఉంటున్నారు. అయితే, జ్యోతికి ఇది వరకే పెళ్లి అయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి విజయ్‌తో ఆమె రిలేషన్‌ను మొదలుపెట్టింది. రెండేళ్ల క్రితం విజయ్‌కి.. జ్యోతి పెళ్లి విషయం తెలిసింది. ఇక, అప్పటినుంచి ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే, జ్యోతి మాత్రం విజయ్‌ని విడిచిపెట్టడానికి అంగీకరించలేదు. కలిసుందాం అంటూ అతడిపై ఒత్తిడి తేసాగింది. తనను పెళ్లి చేసుకోమని కూడా బలవంత పెట్టసాగింది. ఈ నేపథ్యంలోనే ఏడు నెలల క్రితం విజయ్ ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు.
జ్యోతి ఆరు నెలల క్రితం విజయ్ రూములోకి మారింది. జ్యోతి తన రూములోకి రావటంతో విజయ్ తన ఫ్రెండ్ రూముకు మారిపోయాడు. అప్పుడప్పుడు జ్యోతిని కలుస్తూ ఉండేవాడు. మే 11 విజయ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మే 23న బెంగళూరుకు తిరిగి వచ్చాడు. మే 25 జ్యోతి.. విజయ్‌కు ఫోన్ చేసింది. మాట్లాడుకుందాం రమ్మని అంది. విజయ్ ఆమె మాటల్ని కాదనలేక వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్యా చిన్నపాటి వివాదం జరిగింది. ఇకపై తాను జ్యోతితో ఉండలేనని అతడు తెగేసి చెప్పాడు. దీన్ని ఆమె తట్టుకోలేకపోయింది.
ఆ రాత్రి విజయ్ నిద్రలో ఉండగా అతడిపై వేడి నీళ్లు పోసింది. తర్వాత బీరు బాటిల్‌తో కొట్టింది. అతడు గదిలో గిలగిల్లాడుతూ ఉండగా బయట తలుపు వేసి వెళ్లిపోయింది. విజయ్ సహాయం కోసం కేకలు వేయటంతో ఇంటి ఓనర్ వచ్చాడు. తలుపు తీశాడు. గాయాలతో ఉన్న అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. విజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.