ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో గదిలో నిప్పులతో పొగ వేశారు. తలుపులన్నీ వేసేసి ఏసీ ఆన్ చేసి పడుకున్నారు. తర్వాతి రోజు ఉదయం వారు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. గది తలుపులు పగలగొట్టి చూడగా ఒక మహిళ మృతి చెందింది. మిగతా ముగ్గురూ ఆస్పత్రిలో పోరాడుతున్నారు.
దోమల కోసం వేసిన పొగ వల్ల ఊపిరాడకపోవడంతోనే ఇలా జరిగిందని తేలింది. చెన్నైలోని పమ్మల్ తిరువళ్లువర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చెన్నైలోని తిరువళ్లువర్ ప్రాంతానికి చెందిన చొక్కలింగం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఆయన భార్య పుష్పలక్ష్మి ప్లేట్ లో బొగ్గులు ఉంచి దానిలో నూనె పోసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఏసీ ఆన్ చేసుకుని కుటుంబసభ్యులు నిద్రపోయారు.
బయటకు వెళ్లే దారిలేక పొగ గది అంతా వ్యాపించింది. ఆ పొగ వల్ల వారందరూ నిద్రలోనే స్పృహ కోల్పోయారు. తెల్లవారిన తర్వాత వారు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తట్టారు. అయితే లోపల నుంచి స్పందన రాకపోవడంతో తలుపు బద్దలుకొట్టుకుని లోపలకు వెళ్లారు. అప్పటికే పుష్పలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.
మిగిలిన ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.