మనుషుల్లో క్షమాగుణం నశించిపోతోంది. క్షణికావేశంలో కొందరు క్రూరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలే పెద్ద దారుణాలకు దారి తీస్తున్నాయి. ప్రతీ సమస్యకు గొడవలు పడటమే పరిష్కారంగా కొంతమంది భావిస్తున్నారు. ఆ గొడవల కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా, వాషింగ్ మిషిన్ నీటి విషయంలో చోటుచేసుకున్న ఓ గొడవ ఓ మహిళను బలి తీసుకుంది. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఆమెను కొట్టి చంపేశారు. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన పద్మావతి అనే మహిళ అక్కడి మశానం పేటలోని ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. పద్మావతి బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్‌ను ఉపయోగించేది. ఎప్పటిలాగే ఆరోజు కూడా వాషింగ్ మిషన్‌ను ఉపయోగించి బట్టలు శుభ్రం చేయసాగింది. ఈ నేపథ్యంలోనే వాషింగ్ మిషిన్ నుంచి వచ్చే వృధా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్ ఇంటి ముందుకు పారింది. బట్టలు శుభ్రం చేసిన నీరు తమ ఇంటి ముందుకు రావటంతో వేమన్న నాయక్ కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. ఈ విషయమై పద్మావతి కుటుంబసభ్యుల్ని ప్రశ్నించారు.
దీంతో రెండు కుటుంబాల మధ్యా గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలి వానలా మారింది. వేమన్న నాయక్ కుటుంబసభ్యులు మరింత తెగించారు. పద్మావతిపై రాళ్లతో దాడి చేశాడు. ఈ రాళ్ల దాడిలో ఆమె ముఖం, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన బెంగళూరుకు తీసుకెళ్లారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.