అక్షయ ట్రాఫిక్ పోలీసులతో దారుణంగా ప్రవర్తించింది. తన భర్తను ఆపి ప్రశ్నిస్తున్నారన్న కోపంతో వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. అంతటితో ఆగకుండా ఓ ఎస్ఐని కొట్టడానికి కూడా ప్రయత్నించింది.
మధ్య కాలంలో తప్పతాగి వాహనాలు నడపటం బాగా ఎక్కువయిపోయింది. తాగి వాహనాలు నడపటమే కాకుండా.. ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసుల పైకే రెచ్చిపోతున్నారు కొందరు. ఇందులో ఆడ,మగ అన్న తేడా లేదు. తాగిన మైకంలో పోలీసులతో దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే డ్యూటీ చేస్తున్న అధికారులపై ఉత్తి పుణ్యానికి గొడవకు దిగే వారూ ఉన్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్తను ఆపి విచారిస్తున్నారన్న కోపంతో ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది. ఏకంగా వారిని కొట్టడానికి ప్రయత్నించింది. రోడ్డుమీదే రచ్చ రచ్చ చేసింది. ఇంత చేశాక పోలీసులు ఊరికే ఉంటారా? ఆమెతో పాటు భర్తను, అతడి స్నేహితుడ్ని కూడా అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని చెన్నైకి చెందిన సత్యరాజ్ అతడి స్నేహితుడు వినోద్ కుమార్లు సోమవారం తెల్లవారుజామున ఇద్దరూ చెరో బైకుపై వెళుతూ ఉన్నారు. ఈ రెండు వాహనాలను చూళైమేడు వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అనంతరం బండి పత్రాలు సరిగా ఉన్నాయా? లేదా? అని చెక్ చేశారు. వినోద్ కుమార్ బండి పత్రాలు సరిగానే ఉన్నాయి. కానీ, సత్యరాజ్ బండి పత్రాలు లేవు. పోలీసులు దీనిపై అతడ్ని ప్రశ్నించారు.
అతడు ఇంటికి ఫోన్ చేసి తన భార్య అక్షయను బండి పత్రాలు తీసుకురమ్మన్నాడు. కొంత సేపటి తర్వాత అక్షయ బండి పత్రాలతో అక్కడికి వచ్చింది. వచ్చీ రావటంతోటే పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. అంతటితో ఆగకుండా ఎస్ఐని కొట్టడానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు ఆమెను, ఆమెతో పాటు సత్యరాజ్, వినోద్ కుమార్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్షయ పోలీసులపై రెచ్చిపోయిన సంఘటన తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, ట్రాఫిక్ పోలీసులతో గొడవ పెట్టుకుని జైలు పాలైన అక్షయ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.