దాదాపు వారం రోజులపాటు తెలంగాణ సహా యావత్ దేశాన్ని అట్టుడికించిన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటన ఓ ముగింపునకు వచ్చింది. నిందితుడు రాజు స్టేషన్‌ఘన్పూర్ వద్ద రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారు. రాజు మరణించాడని తెలిసి అందరూ హమ్మయ్యా బాగా అయ్యింది అని భావిస్తున్నారు. ఇక్కడ కొందరి నోట వినిపిస్తున్న మరో ప్రశ్న అసలు ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందా?
అతి కిరాతకంగా ఓ ఆరేళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎలా అయితే చిన్నారి కుటుంబం, సమాజం కోరుకుందో అలాగే నిందితుడు రాజు ప్రాణాలు పోయాయి. అంటే న్యాయం జరిగినట్లేనా? కంటికి కన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అన్న సినిమా డైలాగు మాదిరిగా నిజ జీవితంలో జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. బుడి బుడి అడుగులు, ముసిముసి నవ్వులతో కళ్ల ముందు అల్లరి చేస్తూ తిరిగిన ఆ చిన్నారి ప్రాణాలు తిరిగి వచ్చాయా? రాజు ఆత్మహత్యతో ఆ కుటుంబానికి చిన్నారిని తెచ్చివగలిగామా? లేదు కదా. మరి వాడి ప్రాణాలు పోవడం వల్ల కలిగిన లాభం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది తాత్కాలిక ఉపశమనే అవుతుంది తప్ప ఆ కుటుంబానికి సరైన న్యాయం కాదని వాదిస్తున్నారు.
సమాజంలో ఇలాంటి ఘటనలు రోజుకు కొన్ని వందలు జరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపాయి, ఉద్యోగానికి వెళ్లొచ్చే మహిళ, మంచంలోని ముసలమ్మ, కట్టుకున్న భార్య, కన్న కూతురు ఇలా పేరు ఏదైనా.. బలవుతుంది మాత్రం ఆడకూతుళ్లే. కొన్ని వందలు, వేల కేసులు జరుగుతుంటే వాటిలో ఏ ఒకటో రెండో కేసులు మాత్రమే జనాకర్షణ పొందుతున్నాయి. అవి మాత్రమే హైలెట్ అవుతున్నాయి. మళ్లీ ఇంకో కొత్త కేసు వస్తే ఈ కేసు మరుగుణ పడిపోతోంది. సమస్యను మూలాల నుంచి నివారించాలి. ప్రాథమిక దశలోనే ఇందుకు ఒక పరిష్కారం వెతకాలి. ప్రభుత్వాలు ఎంత కఠిన శిక్షలు తెస్తున్నా, న్యాయస్థానాలు ఉరిశిక్షలు వేస్తున్నా.. ఈ దాడులు, అకృత్యాలు ఆగడం లేదు. ఇది ప్రభుత్వమో, పోలీసులో, న్యాయస్థానాలో మాత్రమే తీర్చగలిగే సమస్య కాదు. మీరు, మేము, మనందరం కలిసి కట్టుగా ఒక్కటై రూపుమాపాల్సిన సమస్య. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడండి. మన అక్క, చెల్లి ఎలాగో బయటి ఆడవారిని కూడా అలాగే భావించాలని నేర్పించండి. ఆడ పిల్లలకు చిన్నపటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలియజెప్పండి. పిల్లల్లో అవగాహన పెంచండి. చిన్నారులు ఎవరైనా ఇలా జరిగింది అనగానే ముందు వారిని నిందించకండి. అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలకు ఏమైనా సమస్యలుంటే మీతో చర్చించే స్వేచ్ఛ వారికి ఇవ్వండి. మార్పు మనతోనే, ప్రతి గడప నుంచి ప్రారంభంకావాలని తెలుసుకోండి.