భార్యకు తెల్ల జుట్టు ఉందన్న కారణంతో ఓ భర్త దారుణానికి తెగించాడు. భార్యకు ద్రోహం చేయటానికి డిసైడ్ అయ్యాడు. అతడి ద్రోహం గురించి ముందుగానే తెలుసుకున్న భార్య అతడి ప్లాన్‌ను తిప్పికొట్టింది. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌లోని సరన్ జిల్లా లౌవా కాలా గ్రామానికి చెందిన పంకజ్ షా, షాజిత్‌పూర్ గ్రామానికి చెందిన బబితా దేవీ భార్యాభర్తలు. వీరికి పెళ్లయి 2 సంవత్సరాలు అయింది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం మొదలైంది. ఆ గొడవలు తారాస్థాయికి చేరుకోవటంతో పెద్దలు కలుగజేసుకున్నారు. పంచాయితీ పెట్టి ఇద్దరికీ సర్థి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రెండు సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు పంకజ్ భార్య తలలో తెల్లజుట్టు చూశాడు. దీంతో అతడికి కోపం వచ్చింది. ఆమె తెల్ల జుట్టుపై గొడవ మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్యా ఈ విషయమై గొడవ జరిగింది.
తరచుగా ఆమె తెల్లజుట్టు గురించి మాట్లాడుతూ అతడు వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత బబిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అలా వెళ్లగానే పంకజ్ తన రెండో పెళ్లికి రహస్యంగా ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఓ గుడిలో ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో వెంటనే బబితకు సమాచారం ఇచ్చారు. భర్త రెండో పెళ్లి విషయం తెలిసి ఆమె షాక్ తింది. ఆ వెంటనే తేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తండ్రితో పాటు మరికొంత మందితో భర్త రెండో పెళ్లి జరగబోయే గుడికి వెళ్లింది.
అక్కడ భర్తతో తీవ్రంగా గొడవపడింది. ఈ గొడవ పెద్దదవుతుండటంతో పంకజ్‌తో పాటు పెళ్లి ఏర్పాట్లు చేసిన వారంతా అక్కడినుంచి పరారయ్యారు. బబతి మరో సారి పోలీసులను ఆశ్రయించింది. భర్త, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసింది. అత్తింటి వారు రసగుల్లా, అన్నంలో మందు కలిపి తనకు అబార్షన్ అయ్యేలా చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఆ తిండి తినటానికి తాను ఒప్పుకోకపోవటంతో కొట్టారని అంది. బలవంతంగా పుట్టింటికి పంపారని అంది. తర్వాత భర్త రెండో పెళ్లికి ఏర్పాట్లు చేశారని పేర్కొంది. భర్త పక్కింటి వారి ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని అంది. తాను పెళ్లి జరగబోయే చోటుకి వెళ్లి పెళ్లి ఆపానని వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.