సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ఇట్టే ఫేమస్ అయిపోయారు. వారిలో ఉన్న టాలెంట్‌ను చూపించుకుని సెలబ్రిటీలు అయ్యారు. అయితే అలాంటి వాళ్లను చూసి చాలా మంది స్టార్లు అయ్యేందుకు సోషల్ మీడియాని సాధనంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కొందరు రీల్స్ చేసుకోవడం, స్నాప్‌లు చేయడం ద్వారా ఫేమస్ అవుతుంటే.. ఇంకొందరు మాత్రం వాటి మాయలో పడి జీవితాలను, కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. గతంలో టీవీ సీరియళ్లు వచ్చాక మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ భార్యలపై ఫిర్యాదు చేసేవాళ్లు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. రీల్స్ లో పడిపోయి నా గురించి పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
కొందరు గృహిణులు, మహిళలు అయితే లేచిందే ఫోన్లు పట్టుకోవడం, రీల్స్- ఫాలోవర్స్ అంటూ ఇంట్లో భర్త, పిల్లలను పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. అయితే ఇలా రీల్స్ పిచ్చిలో పడి ఓ మహిళ తన కాపురాన్ని ముక్కలు చేసుకుంది. చివరికి ప్రాణాలు కూడా కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. 38 ఏళ్ల అమృతలింగం తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్ లోని సెల్లం నగర్‌లో జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం చిత్ర అనే మహిళతో వివాహం జరిగింది. వారికి కుమార్తె కూడా ఉంది. అమృత లింగం తెన్నం పాలాయం కూరగాయల మార్కెట్ లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. చిత్ర గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేది.
చిత్రకి సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు. రీల్స్ చేస్తూ ఫేమస్ అయిపోయి సినిమాల్లోకి వెళ్లాలని ఆమె కోరుకుంది. అయితే రీల్స్ చేసే విషయంలో అమృతలింగానికి చిత్రకు అస్సలు పడేది కాదు. తనని అసలు పట్టించుకోకుండా ఎప్పుడూ రీల్స్ చేస్తూ ఉంటుందని అతను ఆరోపించేవాడు. అదే విషయంలో వారి మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న కొద్దీ చిత్రకు ఫాలోవర్లు పెరిగిపోయారు. ఆమెకు 33 వేలు దాటి ఫాలోవర్స్ రావడంతో రీల్స్ ఆపేందుకు ఇష్టపడలేదు. ఇంకా కొత్తగా రీల్స్ చేసి బాగా ఫేమస్ అవ్వాలని.. ఆ తర్వాత సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. అందుకే తిరుప్పూర్ నుంచి చెన్నైకి వెళ్లిపోయింది.
ఇటీవలే కుమార్తె వివాహం ఉండటంతో చిత్ర ఇంటికి వచ్చింది. వివాహం జరిగిన రోజు సాయంత్రం తిరిగి చెన్నై వెళ్లేందుకు రెడీ అయ్యింది. అయితే అమృతలింగం ఆమెను వెళ్లొద్దని అక్కడే ఉండాల్సిందిగా కోరాడు. అయితే చిత్ర ఆరోజు అక్కడే ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి కూడా చిత్ర రీల్స్ అప్‌లోడ్ చేసే విషయంలో అమృతలింగానికి ఆమెకు గొడవ జరిగింది. సహనం కోల్పోయిన అమృతలింగం ఆమె మెడలో ఉండే చున్నీతో గొంతుని గట్టిగా బిగించాడు. బలంగా చున్నీ బిగించడంతో చిత్ర స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. భయంతో అమృతలింగం.. చిత్రను కొట్టానని కుమార్తెకు చెప్పి పారిపోయాడు. కుమార్తె వెళ్లి చూడగా.. అప్పటికే చిత్ర ప్రాణాలు కోల్పోయింది. విషయం పోలీసులకు తెలపగా.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించింది. పెరుమనల్లూరులో అమృతలింగాన్ని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.