పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కుమార్తె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తల్లి, కుమారుడు చనిపోగా కూతురు కొన ప్రాణాలతో బయటపడింది. దీంతో ఆ యువతి తండ్రి స్పందించి కూతురుని వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సత్యప్రభ అనే వివాహిత నివాసం ఉంటుంది. ఆమెకు కొడుకు త్రిభువన్ తో పాటు అమృత అనే కూతురు కూడా ఉంది. ఇక పిల్లలను బాగా చదివించుకుంటూ సత్యప్రభ దంపతులు సంతోషంగా గడిపేవారు. ఇదిలా ఉంటే, ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ, శుక్రవారం రాత్రి 6 గంటల సమయంలో తల్లి సత్యప్రభ, కొడుకు త్రిభువన్, కూతురు అమృత ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కూతురు అమృత కొన ప్రాణాలతో బయటపడింది.
దీనిని గమినించిన ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ప్రాణాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు తల్లి, కుమారుడి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అమృత తండ్రి హుటాహుటిన ఆస్పత్రిలో ఉన్న కూతురి వద్దకు వెళ్లాడు. అయితే.., భార్య, కొడుకు చనిపోవడం, కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? ఇటీవల విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాల్లో కొడుకు త్రిభువన్ 1000కి 974 మార్కులు సాధించడం విశేషం. అయితే ఈ ముగ్గురు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది తెలియాల్సి ఉంది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.