ఈ మధ్యకాలంలో హత్యలు, దారుణాలు ఎంతో పెరిగిపోయాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా వారిని అరికట్టలేకపోతున్నారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలే ఎక్కువ క్రైమ్ కు కారణంగా కనిపిస్తున్నాయి. భర్తను భార్య హత్య చేయడం, భార్యను భర్త కడతేర్చడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. అతను చేసిన పనికి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆ ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఏంటంటూ అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి పరిధి కుకునూరులో ఈ దారుణం వెలుగు చూసింది. ఆశాజ్యోతి(30) కుకునూరులో అంగన్ వాడీ హెల్పర్ గా పనిచేస్తోంది. ఆమెకు వీర వెంకట సత్యనారాయణతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సురేంద్ర 8వ తరగతి, తేజ ఐదో తరగది, గోపి దుర్గా నాల్గో తరగతి చదువుతున్నారు. కొన్నాళ్ల క్రితం విబేధాల కారణంగా భార్యా భర్తలు ఇద్దరూ విడిగా ఉండటం మొదలు పెట్టారు. అయితే ఇటీవల వెంకట సత్యనారయణ తిరిగి భార్య వద్దకు వచ్చాడు. పిల్లల కోసం కలిసే ఉందామంట ఆమెను ఒప్పించాడు. పిల్లల భవిష్యత్ కోసం ఆమె కూడా కలిసి ఉండేందుకు అంగీకరించింది. అయితే అదే ఆమె చేసిన అతి పెద్ద పొరపాటు అయిపోయింది.
సోమవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో భార్య ఆశాజ్యోతితో వెంకట సత్యనారాయణ వాగ్వాదానికి దిగాడు. కత్తితో విచక్షణారహితంగా ఆమె మెడ, గొంతుపై నరికాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె విలవిల్లాడుతూ కన్నుమూసింది. ఆ తర్వాత సత్యనారయణ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. తల్లి మృతితో పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తల్లి మృతి.. తండ్రి అరెస్టు అవ్వడంతో అనాథలమయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెపై అనుమానంతోనే వెంకట సత్యనారాయణ ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.