చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగాలే చేయాలి.. చదివిన వారందరకి ఉద్యోగాలు కల్పించాలి అంటే కుదరదు. చదువు అనేది జీవనోపాధికి మార్గం చూపుతుంది. అంటే కేవలం ఉద్యోగ పరంగానే కాదు.. తప్పు చేయకుండా.. మన తెలివి తేటలతో.. జీవితంలో ముందుకు సాగే దారి చూపుతుంది. కానీ నేటి కాలంలో చదువుకు అర్థమే మారిపోయింది. ఉద్యోగాలు రాని చదువు వ్యర్థం అన్నట్లుగా పరిస్థితులు మారాయి. దాంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..
చదివేస్తే ఉన్న మతి పోతుంది అంటారు.. నేటి కాలంలో కొందరు యువత తీరు చేస్తే.. ఈ మాటలు అక్షర సత్యాలు అనిపించక మానవు. చదువుకుంటే లోక జ్ఞానం తెలుస్తుంది.. మంచి చెడు విచక్షణ తెలుస్తుంది.. జీవితంలో ముందుకు సాగే ధైర్యం ఇస్తుంది అంటారు. కానీ నేటి చదువులు యువతను కుంగదీస్తున్నాయి. బతుకు మీద భరోసా కల్పించాల్సింది పోయి.. వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ.. చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. మన దేశంలో రైతన్నల తర్వాత ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతుంది విద్యార్థులు, నిరుద్యోగులే అంటే.. మన చదువులు ఎంత బాగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా డిగ్రీ పూర్తి చేసిన ఓ యువతి అత్యంత దారుణ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తనకు ఎంత ప్రేమ పంచినా సరే.. ఓ భయం తనను కుదిపేస్తుంది.. బతకలేనంటూ ప్రాణాలు తీసుకుంది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. డిగ్రీ వరకు చదివిన యువతి.. తనకు ఉద్యోగం రాదనే భయంతో.. మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గ్రేటర్ వరంగల్ పరిధిలో చోటు చేసుకుంది. 16వ డివిజన్ ధర్మారంలో నివాసం ఉంటున్న ఊదర రవికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయిలు ఇద్దరికి వివాహం అయ్యింది. చిన్న కుమార్తె మేఘన డిగ్రీ పూర్తి చేసి.. ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక మేఘన డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరీలో మేఘన తన మనసులో బాధను పేపర్ మీద అక్షర రూపంలో వెల్లడించింది. ‘‘డిగ్రీ వరకు చదివిన నేను.. నా కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మా నాన్న ఆరేళ్ల క్రితం మద్యం మానేసి.. మాతో బాగానే ఉంటున్నాడు.. బాగా చూసుకుంటున్నాడు. డిగ్రీ పూర్తి చేసినా జాబ్ రావడం లేదనే సమస్య నన్ను కుదురుగా ఉండనీయడం లేదు. ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను’’ అంటూ తన మనసులో గూడుకట్టుకున్న వ్యధను వెల్లడించింది.
‘‘అందరు జాబ్ కోసం ప్రయత్నించి.. రిజల్ట్ వచ్చాక.. గెలిచారో.. ఓడిపోయారో అర్థం అవుతుంది. కానీ నా విషయంలో మాత్రం.. నేను ప్రయత్నించకుండానే.. ఓడి పోతున్నాను. అమానాన్న.. నన్ను క్షమించండి.. మిస్ యూ.. అక్కలు, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి’’ డైరీలో రాసుకుంది. జాబ్ రావడం లేదన్న బాధలోనే మేఘన ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు. పోలీసులు డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందరూ బాగుండాలని కోరుకుని.. నువ్వేందుకు నీ జీవితాన్ని ఇలా అర్థాంతరంగా ముగించావు తల్లి.. మేం గుర్తుకు రాలేదా అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. మేఘన తీసుకున్న నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.