విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న మహిళ మర్డర్ మిస్టరీ వీడింది. బంధువే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అతడు విజయవాడ దుర్గమ్మకు తలనీలాలు సమర్పించాడు.
లక్కవరపు కోట మర్డర్ కేసులో నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ బంధువే హత్య చేసినట్లు గుర్తించారు. ఏడు రోజుల తర్వాత ఈ కేసు మిస్టరీ వీడింది. ఈనెల 15న వరుసకు పెద్దమ్మ అయిన మహిళ మెడలో బంగారం లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె తిరగబడడంతో హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా చేసి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం జమ్మాదేవి పేటకు చెందిన కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కృష్ణ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ గడుపుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే పెద్దమ్మ వరుసయ్యే మాదాబత్తుల సూర్యకాంతంపై అతడి కన్ను పడింది. ఆమె మెడలోని బంగారం దొంగిలిస్తే తన సమస్యలు తీరతాయని అనుకున్నాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. తన ముఖానికి ముసుగును ధరించి, సూర్యకాంతం మెడలో ఉన్న బంగారం గొలుసును తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించే క్రమంలో ముఖానికి ఉన్న ముసుగు తొలగిపోయింది. అతనిని గుర్తించిందని నిందితుడు సూర్యకాంతాన్ని హతమార్చాడు. ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు పాటించి, పారిపోయాడు.
బంగారంతో పారిపోయిన కృష్ణ తాకట్టు పెట్టిన డబ్బులతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టాడు. తన భార్య, పిల్లలను అత్తవారింట్లో వదిలేశాడు. అక్కడి నుండి తాను చేసిన పాపం పోవాలని విజయవాడ వెళ్లి తలనీలాలు సమర్పించాడు. అక్కడినుంచి కూలి పనుల కోసం కర్ణాటక వెళ్లిపోయాడు. పోలీసులకు కృష్ణపై అనుమానం వచ్చింది. అతడి భార్య ఫోన్ కాల్ తో ఇంటికి వచ్చిన కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.