శ్వేత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె శవం నగ్నంగా బీచులో కనిపించటం చర్చనీయాంశంగా మారింది. శ్వేత మరణం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
వైజాగ్‌కు చెందిన శ్వేత అనే వివాహిత మంగళవారం ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు న్యూపోర్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కనిపించకుండా పోయిన శ్వేత కోసం గాలిస్తూ ఉన్నారు.
బుధవారం ఉదయం విశాఖ ట్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఓ సమాచారం అందింది. బీచ్‌లో ఓ అమ్మాయి శవం బట్టలు లేకుండా పడి ఉందని పోలీసులకు తెలిసింది. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. బీచ్‌లోని ఇసుకలో కూరుకుపోయిన శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఆ మృతదేహం గాజువాక నడుపూరికి చెందిన శ్వేతదిగా గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కనిపించకుండా పోయిన శ్వేత బీచులో విగతజీవిగా కనిపించటంతో ఇటు అత్తింటివారు.. అటు పుట్టింటివారు విషాదంలో మునిగిపోయారు.
శ్వేత, మణికంఠలకు 2022 ఏప్రిల్ 15న పెళ్లయింది. ఆమె భర్త ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శ్వేత ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో బీటెక్ చేసింది. ఐఏఎస్ అవ్వాలని కలలు గంది. పెళ్లికి ముందు ఈ విషయాన్ని భర్త మణికంఠకు చెప్పింది. ఇందుకు అతడు సరే అన్నాడు. పెళ్లయిన తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది. మణికంఠ వర్క్‌ఫ్రమ్ హోం చేస్తూ ఉన్నాడు. కంపెనీ వాళ్లు వర్క్‌ఫ్రమ్ హోం ఎత్తేయటంతో అతడు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. పది రోజుల క్రితమే మణికంఠ హైదరాబాద్ వెళ్లాడు. శ్వేత ఐదు నెలల గర్భంతో ఉండటంతో ఆమెను విశాఖలోనే ఉంచాడు. మంగళవారం ఇద్దరి మధ్యా చిన్న గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన శ్వేత ఏప్రిల్ 25న ఆత్మహత్య? చేసుకుంది.
శ్వేత మరణంపై ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘‘ పెళ్లయిన రెండు నెలల నుంచి శ్వేత భర్తే లోకంగా బతికింది. ఆ భర్త మాత్రం తనను అర్థం చేసుకోలేదు. అక్కాచెల్లెళ్లు.. అమ్మ మాటలు తప్ప ఏదీ పట్టించుకునేవాడు కాదు. ‘ నాకు నా భర్త కావాలమ్మా.. నా మణి నన్ను అర్థం చేసుకోవటం లేదమ్మా.. నేను ఆయన్ని ఇష్టపడ్డానమ్మా.. చాలా ప్రేమగా ఉన్నానమ్మా’ అనేది. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్న భర్త కోసం చనిపోయింది. ఇన్నేళ్లు కని,పెంచిన అమ్మ గురించి పట్టించుకోలేదు. నా భర్త చనిపోయిన తర్వాత శ్వేతను అపురూపంగా పెంచుకున్నాను. భార్య గర్భంతో ఉన్నా మణికంఠ పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ వాళ్ల అక్క,చెల్లెళ్ల పిల్లల గురించి ఆలోచించేవాడు. నా కూతుర్ని ఎవరూ సరిగా పట్టించుకునేవాళ్లు కాదు. నా కూతురు అత్తింట్లో కష్టాలను నాకు చెప్పుకుని బాధపడేది. నా ఒక్కగానొక్క కూతుర్ని చంపేశారు’’ అంటూ కన్నీళ్ల పర్యంతం అయింది.
శ్వేత తాను చనిపోవటానికి ముందు రాసినట్లు భావిస్తున్న ఓ సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. ఆ సూసైడ్ నోట్‌లో.. ‘‘ ‘నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలవని. నీకు అసలు ఏం మాత్రం ఫరఖ్ పడదు అని. ఏనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు. బికాజ్ నువ్వు బయటకు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యు నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్’’ అని రాసి ఉంది. బుధవారం ఆమె శవం బీచ్‌లో దొరికిన పరిస్థితి.. ఒంటిపై గాయాలు ఇవన్నీ చూస్తుంటే ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోవాలని అనుకున్న ఆమె సముద్రంలో దూకింది అనుకుంటే.. ఒంటిపై బట్టలు లేకుండా శవం కనిపించటం ఏంటి?.. సముద్రంలో దూకితే బట్టలు మొత్తం ఊడిపోతాయా? అసలు ఆమె ఒంటి మీదకు గాయాలు ఎలా వచ్చాయి? సముద్రంలోని రాళ్లను తగిలి ఆ ఒంటిపై గాయాలు అయ్యుంటాయా? ఇంతకీ ఆమెది ఆత్మహత్యా? లేక ఎవరైనా చంపి సముద్రంలో పడేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.