బుధవారం విశాఖ బీచ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన గర్భిణీ శ్వేత కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్తింటి వేధింపులు భరించలేక తన కూతురు చనిపోయి ఉంటుందని.. శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బుధవారం విశాఖ వైఎంసీఏ బీచ్‌లో మహిళ మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. మృతురాలు పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో వివాహిత శ్వేత మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. కొంతకాలంగా భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువ అయ్యాయని.. శ్వేత ఇంటి నుండి బయలుదేరే గంట ముందు కూడా తన భర్త మణికంఠతో గొడవ పడిందని శ్వేత తల్లి సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు మణికంఠ కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శ్వేత కాల్స్ రికార్డింగ్స్, పోస్ట్ మార్టం కీలకంగా మారనున్నాయి. కేజీహెచ్ లో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు.
శ్వేత మృతి కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృతురాలి తల్లి రమాదేవి ఫిర్యాదు చేయడంతో అత్తమామలు, భర్త, మరో వ్యక్తిపై 304(బి) సెక్షన్ కింద వరకట్న వేధింపుల గురిచేసినట్లు కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులు శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే ఏం జరిగిందో చెబుతాం అంటున్నారు పోలీసులు. అప్పటి వరకు ఆత్మహత్యా..? హత్యా అన్న విషయం పోస్ట్ మార్టం నివేదికలో కీలకం కానున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి పెదగంట్యాడ నుంచి ఆర్ కే బీచ్ వరకు ఎలా వచ్చింది.. ఆమెను ఎవరైనా తీసుకు వచ్చారా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మార్గ మద్యలో సీసీ టీవీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే శ్వేతకు సంబంధించిన ఫోన్, సూసైడ్ లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెళ్లైనప్పటి నుంచి తన కూతురుని అత్తమామలు తీవ్రంగా వేధించారని.. అది తట్టుకోలేక భర్తతో చెబితే అతను కూడా నిర్లక్ష్యం చేశాని.. దీంతో మనస్థాపానికి చెందిన తన కూతురు ఇంతటి అఘాయిత్యానికి పాల్పపడిందని శ్వేత తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఐదు నెలల గర్బవతి అని తెలిసి కూడా మానసికంగా చిత్రం హింసలు పెట్టారని కన్నీరు పెట్టుకుంది శ్వేత తల్లి రమాదేవి. నెల రోజుల క్రితం తన భర్త తనకు విడాకులు ఇస్తానని చెప్పినట్లు తనతో చెప్పి కన్నీరు పెట్టుకుందని రమాదేవి ఫిర్యాదులో పేర్కొంది. శ్వేత మృతదేహం విశాఖ పట్టణం కేజీహెచ్ ఆసుపత్రిలో నేడు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత తల్లికి అప్పజెబుతాం అన్నారు పోలీసులు.