పెళ్లిరోజు కావడంతో సరదాగ గడిపేందుకు భర్త శ్రీనివాస్ తో పాటు భార్య సాయి ప్రియ విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లి ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే సాయి ప్రియ, భర్త శ్రీనివాస్ బీచ్ లో ఉండగా.. నా ఫోన్ కు అప్పుడే ఏదో మెసెజ్ వచ్చిందని, వచ్చిన మెసెజ్ చూసుకోవడానికి ముందు కదిలి కొద్ది సేపటికి వెనక్కి తిరిగి చూసేసరికి నా భార్య కనిపించలేదు. ఇక కనిపించకపోవడంతో సాయి ప్రియ సముద్రంలో గల్లంతు అయిందని భర్త శ్రీనివాస్ బీచ్ పోలీసులకు వివరించాడు.
భర్త ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రెండు నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్ సాయంతో సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకి కోసం ఇప్పటికీ కూడా నేవీ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెళ్లి రోజున భర్తతో పాటు సరదాగ గడిపేందుకు వస్తే ఇలా జరగడంతో సాయి ప్రియ తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సోమవారం నుంచి గాలిస్తున్న సాయి ప్రియ ఆచూకి మాత్రం దొరకలేదు.
అయితే సాయి ప్రియ గల్లంతుపై బీచ్ పోలీసులుకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆ బీచ్ లో అంతమంది ఉండగా కనురెప్పవాల్చే సమయంలోనే ఆ మహిళ ఎలా గల్లంతు అవుతుంది? ఎవరైన తోశారా లేక భర్తే ఆమెను సముద్రంలోకి తోసేశారా అనే అనుమనాలకు తావు ఇస్తుంది. అయితే సాయి ప్రియ ఆచూకి కోసం గజ ఈతగాళ్లు సైతం సముద్రంలోకి వెళ్లి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సాయి ప్రియ ఆచూకి దొరకడం లేదు. అయితే ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు భర్తను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.