ఈరోజుల్లో ముసలివారు, దివ్యాంగులు, వితంతువులకు పింఛను డబ్బులు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే అలాంటి పింఛను సొమ్మును పంచాల్సిన ఓ వాలంటీరు.. ఆ డబ్బులతో ఉడాయించడం హాట్ టాపిక్‌గా మారింది.
వృద్ధాప్యంలో ఉన్నవారికి పెన్షన్ ఎంత ముఖ్యమనేది తెలిసిందే. అనారోగ్యంతో బాధపడే ముసలివారికి ఈ డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. వారికి మెడిసిన్స్ తీసుకోవాలన్నా, ఎటైనా ప్రయాణాలు చేయాలన్నా సర్కారు ఇచ్చే పింఛనే దిక్కు. ఎవరూ లేనివారికి, పిల్లలు వదిలేసిన వృద్ధులకు ఆర్థిక భరోసాగా ఇచ్చే పింఛన్ శ్రీరామరక్ష అనే చెప్పాలి. ముసలివారితో పాటు దివ్యాంగులు, వితంతువులకు కూడా పింఛన్ డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే అలాంటి పించన్ల డబ్బుతో ఉడాయించాడో వాలంటీరు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలంలో జరిగింది. చింతపల్లి మండలంలోని చౌడుపల్లి-2 సచివాలయంలో ఒక వాలంటీరు పింఛన్లను అరకొరగా పంపిణీ చేసి మిగిలిన డబ్బులతో ఉడాయించాడు.
వాలంటీరు పెన్షన్ డబ్బులతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగుజూసింది. వాంగెత్త కొత్తూరు గ్రామానికి చెందిన వాలంటీరు కించె బాలకృష్ణ తన పరిధిలో 26 మందికి పింఛన్లను పంపిణీ చేయాలి. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రూ.62,250 మొత్తాన్ని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తిరుపతిరావు బ్యాంకు నుంచి డ్రా చేసి బాలకృష్ణకు అందించారు. అయితే పింఛను డబ్బులను 13 మందికి మాత్రమే ఇచ్చిన అతడు.. మిగిలిన వారికి పంపిణీ చేయలేదు. మిగిలిన సొమ్ము రూ.30,250తో బాలకృష్ణ పరారయ్యాడు. దీంతో తిరుపతిరావు ఎంపీడీవో సీతయ్యకు సమాచారం అందించారు. దీనిపై సీతయ్య స్పందిస్తూ.. ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ వరకు పింఛన్ల పంపిణీకి గడువు ఇచ్చిందన్నారు. వాలంటీరు కుటంబ సభ్యులు పింఛను డబ్బులను శుక్రవారం నాటికల్లా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని సీతయ్య చెప్పారు