ప్రేమ… ఈ మాయలో పడి ఎంతో మంది యువతి యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో చదువును పక్కనబెట్టి ప్రేమ పేరుతో జులాయిగా తిరుగుతున్నారు. అలా కొన్నాళ్ల పాటు సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగి చివరికి మోసం చేయడంతో హత్య చేయడం లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా విజయవాడలో చోటు చేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
విజయవాడలో అబ్దుల్ సలామ్ అనే యువకుడు నివాసం ఉంటూ ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. రోజూ కాలేజీకి వెళ్లే క్రమంలోనే ఇతడికి సుకమిక అనే అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా అబ్దుల్ తో మాట్లాడింది. అలా వీరిద్దరూ కొంత కాలం పాటు మాట్లాడుకుని చివరికి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ నెలల నుంచి సంవత్సరాలు గడిచింది. అయితే అబ్దుల్ కు తెలియకుండా ఆ యువతి అదే కాలేజీలో లెక్చరర్ తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అబ్దుల్ కు తెలియకుండా దాచి సుకమిక లెక్చరర్ తో లవ్ స్టోరీని కొనసాగించింది. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుంచి ఆ యువతి అబ్దుల్ తో సరిగ్గా మాట్లాడం లేదు.
ఈ తరుణంలోనే సుకమిక అబ్దుల్ ను ప్రేమిస్తున్నట్లు నటించి లెక్చరర్ తో తిరిగింది. ఇదే విషయం ఇటీవల అబ్దుల్ కు తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ప్రియురాలి చేసిన మోసాన్ని తట్టుకోలేక తనలో తాను కుమిలిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇక ప్రియురాలు మోసం చేసిన ఇలాంటి జీవితం నాకు వద్దునుకుని.. నేను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్లుగా నటించి మోసం చేసింది. ఇదే కాకుండా పెళ్లైన లెక్చరర్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తుంది. అతనితో రాత్రిపూట అసభ్యకరంగా వీడియో కాల్ కూడా మాట్లాడుతుంది. నమ్మిన ప్రియురాలు మోసం చేయడంతో నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఈ రోజుల్లో అబ్బాయి మోసం చేస్తే హైలెట్ చేస్తారు. అదే అమ్మాయి మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అని అబ్దుల్ సూసైడ్ లెటర్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయాన్ని పోలీసులు ఆ యువకుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.