ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడమే జీవితం అంటారు. ఇక తాజాగా చోటు చేసుకున్న ఓ ప్రమాదం చూస్తే.. ఈ మాటలు నిజమే అనిపిస్తాయి. రెప్పపాటులో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.
ఈమధ్య కాలంలో చోటు చేసుకునే ప్రమాదాలను గమనిస్తుంటే.. వార్ని ఇలా కూడా జరుగుతాయా.. ఇవేం యాక్సిడెంట్‌లు.. కనీసం మనం ఊహించలేం కూడా కదా అనిపించక మానదు. గతంలో ఓ బస్సు పూర్తిగా బోల్తా పడి రివర్స్ అయిన దృశ్యం చూశాం. ఇక తాజాగా బ్రిడ్జీ మీద నుంచి వెళ్తున్న లారీ.. అదుపు తప్పి.. బ్రిడ్జి కింద ఉన్న ఇంటి మీద పడింది. రెప్పపాటులో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో.. శుక్రవారం రాత్రి.. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయల లోడుతో వస్తున్న ఓ లారీ.. అదుపుతప్పి స్క్రూ బ్రిడ్జి మీద నుంచి కిందకి బోల్తా పడింది. ఈ క్రమంలో ఆ లారీ.. బ్రిడ్జి పక్కన ఉన్న చిన్న ఇంటి మీద పడింది. లారీ కిండ పడ్డ సమయంలో ఇంటి ప్రాంగణంలో మూడేళ్ల చిన్నారి ఒకరు ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో లారీ ఇంటి మీద పడటంతో.. దానిలో ఉన్న మామిడికాయలు చిన్నారి మీద పడిపోయాయి. ప్రమాదం గమనించిన వెంటనే స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. ఓ గంట పాటు శ్రమించి, మామిడికాయలను పక్కకు తొలగించి బాలుడిని బయటకు తీశారు.
కొన ఊపిరితో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడు ఊహించని రీతిలో మృత్యువాతపడటంతో ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. కొడుకును ఎత్తుకొని గుండెలు బాదుకుంటున్న ఆ తల్లి శోకం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇక ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి, మామిడికాయలను పక్కకు తొలగించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మామిడికాయలతో పాటు వాటి మీద కప్పిన టార్బన్ కూడా చిన్నారి మీద పడటం వల్లే.. ఊపిరాడక బాధితుడు మృతి చెందినట్లు భావిస్తున్నారు.
బాలుడికి పోస్టు మార్టం చేయకుండా.. మృతదేహాన్ని తమకు ఇవ్వాలంటూ స్థానికులు ఆందోళనచేశారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి కాసేపు ముందు ఇంటి బయట కుళాయి వద్ద చిన్నారికి స్నానం చేయించిన తల్లి.. టవల్ కోసమని ఇంట్లోకి వెళ్లింది. అంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయింది. చిన్నారి మృతికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు గొడవకు దిగారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పారు. ప్రస్తుతం మార్చురిలోనే బాలుడి మృతదేహం ఉంది. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.