ప్రతిభ పిన్ని ఊరిలో జరుగుతున్న జాతరకు వచ్చింది. ఈ విషయం ఆమె ప్రియుడు హనుమంతుకు తెలిసింది. తాను లేకున్నా ఆమె సంతోషంగా ఎలా ఉండగలుగుతోంది అన్న కోపం అతడికి వచ్చింది. సైకాలా మారాడు.
ప్రేమలు రెండు మనసుల్లో నిర్ణయించబడతాయి.. కానీ, పెళ్లిళ్లు మాత్రం స్వర్గంలో నిర్ణయించబడతాయి. అందుకే, ప్రేమించుకున్న ప్రతీ వారు పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలన్న రూలేమీ లేదు. అలాగని పెళ్లి అనేది ప్రేమకు అల్టిమేట్ గోలేమీ కాదు. మనసులో ప్రేమ ఉన్నపుడు ఎదుటి వ్యక్తి సంతోషాన్ని కోరుకోవటమే ఉత్తమం. వారు మనతో ఉన్నా.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా వారు సంతోషంగా ఉంటే చాలు అనుకోవటమే నిజమైన ప్రేమకు నిదర్శనం. అయితే, ఈ కాలంలో ప్రేమ కంటే స్వార్థం ఎక్కువవుతోంది. తమకు దక్కని ప్రియురాలు సంతోషంగా ఉంటే చూడలేని వాళ్లు చాలా మంది ఉన్నారు. సైకోల్లాగా ప్రియురాళ్లను చంపేసిన వాళ్లు కూడా ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు.
తాజాగా, ఓ వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగా ఆమెను కత్తితో నరికి చంపాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, విజయనగర జిల్లాలోని పరపనహళ్లి తాలూకా, దుర్గావతి గ్రామానికి చెందిన హనుమంతు, అదే గ్రామానికి చెందిన ప్రతిభ ప్రేమించుకున్నారు. అయితే, వీరి పెళ్లికి ప్రతిభ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఆమెను రాణబెన్నూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవటంతో హనుమంతు సైకోగా మారాడు. ప్రతిభ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత ప్రతిభ సంతోషంగా జీవనం సాగిస్తోంది.
తాజాగా, ఆమె తన పిన్ని ఊరిలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. జాతరలో ఆమెను చూసిన హనుమంతు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే ఆమెను చంపేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హనుమంతును అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.