సైకో కిల్లర్ల గురించి మనం వినే ఉంటాము. ఒక్కో సైకో కిల్లర్‌కు ఒక్కో మోటివ్ ఉంటుంది. వీళ్లు హత్యలు చేసే సమయంలో రాక్షసుల్లా మారతారు. తమ బారినపడిన వారిని అతి క్రూరంగా చంపుతూ ఉంటారు. తాజాగా, ఓ భయంకరమైన కుర్ర సైకో గురించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనలో ఆ కుర్ర సైకోకు ఆడవాళ్లను ఒంటరిగా చూడగానే దెయ్యం పడుతుందట. దీంతో మొత్తం ముగ్గుర్ని చంపేశాడు. నాలుగో మహిళను చంపే ప్రయత్నంలో దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తర ప్రదేశ్‌లోని బరబంకీ, అసంద్ర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అమరేంద్ర రావత్‌కు ప్రస్తుతం 20 ఏళ్లు. ఇతడి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. దీంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే, పిన తల్లి అతడ్ని సరిగా చూసుకోలేదు. పినతల్లి, తండ్రి తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. రెండో భార్యతో గొడవల కారణంగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా అమరేంద్రను సరిగా చూసుకునేది కాదు. పినతల్లుల ప్రవర్తన కారణంగా మహిళలు అంటే అతడికి అసహ్యం మొదలైంది. వారిని చూస్తే పగతో రగిలిపోయేవాడు. అమరేంద్రకు 16 ఏళ్లు ఉన్నపుడు పెళ్లయింది.
అయితే, భార్యతో కూడా అతడు సరిగా ఉండలేకపోయాడు. గొడవల కారణంగా ఆమెకు దూరం అయ్యాడు. ఇక, అప్పటినుంచి ఒంటరిగా ఉండటం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉన్న కారణంగా అతడిలో ఆడవారిపై పగ మరింత పెరిగింది. మొదటిసారి డిసెంబర్ 6న ఖుషేటి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిని రేప్ చేసి చంపేశాడు. తర్వాత డిసెంబర్ 17న ఇబ్రహింబాద్‌కు చెందిన మహిళను చంపేశాడు. ఆ వెంటనే డిసెంబర్ 29న 55 ఏళ్ల ఓ మహిళను చంపేశాడు. నాలుగో మహిళను చంపటానికి తీసుకెళుతూ ఉండగా గ్రామస్తులకు చిక్కాడు.
గ్రామస్తులు అతడికి దేహ శుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. పోలీసుల విచారణలో అతడు చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. ఒంటరిగా మహిళల్ని చూడగానే తనకు దెయ్యం పడుతుందని చెప్పాడు. 8 సార్లు తాను తాయత్తు కట్టించుకున్నానని.. అయినా ఫలితం లేకపోయిందని తెలిపాడు. మరి, దెయ్యం పట్టి హత్యలు చేశానంటున్న ఈ కుర్ర సైకో స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.