పెళ్లి అనేది ఆడవాళ్ల జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. పెళ్లితో వారి జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఓ కొత్త వ్యక్తితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టి.. ఓ ఇంటినుంచి మరో ఇంటికి వెళతారు. ఎన్నో కలలు, ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అందరూ అనుకుంటారు. అయితే, కొంతమంది జీవితాలు అనుకున్నట్లు కాకుండా దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోతాయి. అత్తింటి వేధింపులు పెరిగే కొద్దీ జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్యలు చేసుకున్నవారు కొందరైతే.. అత్తింటి వారు చంపేసిన వారు మరికొందరు. తాజాగా, ఓ యువతి అత్తింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, శంబల్, చడౌసీ కొత్వాలీ ఏరియాకు చెందిన కౌశల్ అనే వ్యక్తికి, అదే ప్రాంతానికి చెందిన మాధురి అనే యువతికి గత సంవత్సరంలో పెళ్లయింది. అప్పగింతల తర్వాత మాధురి అత్తింట్లో అడుగుపెట్టింది. మాధురి, కౌశల్‌ల కాపురం కొన్ని రోజులు బాగానే సాగింది. ఆ తర్వాతినుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురమ్మని వేధించేవారు. ఆమె కుటుంబసభ్యులు ఎంత ఇచ్చినా వారికి సరిపోయేది కాదు. ఇంకా కావాలని వేధించేవారు.
ఈ నేపథ్యంలోనే మాధురి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మాధురి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మాధురి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటివారే అదనపు కట్నం కోసం ఆమెను చంపేశారని మాధురి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అత్తింటివారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాధురిది హత్యా? ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.