జనాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తప్పు చేసిన వారిని శిక్షించటం ఎప్పటినుంచో జరుగుతూ వస్తోంది. రేపులు, హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించారంటే అందులో పెద్ద తప్పేమీ లేదు. ఏదో కోపంలో చేశారనుకోవచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న తప్పులు చేసేవారికి కూడా జనం పెద్ద శిక్షలు వేస్తున్నారు. చిల్లర దొంగతనాలు చేసే వారిని కొట్టి చంపేస్తున్నారు. తాజాగా, చీర కట్టుతో ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. జనం చేతిలో దెబ్బలు తిని చచ్చాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లఖిమ్‌పురి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి దొంగతనాలు చేసి జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంనుంచి చుట్టు పక్కలి ఊర్లలో దొంగతనాలు చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలోనే చహలార్ గ్రామంలో దొంగతనానికి వెళ్లాడు. ఈ సారి చీర కట్టుకుని ఓ ఇంట్లోకి దూరాడు. దొంగతనం చేస్తుండగా ఇంట్లోని వాళ్లు చూశారు. గట్టిగా కేకలు వేస్తూ అతడ్ని పట్టుకున్నారు. పలానా ఇంట్లో దొంగపడ్డాడని తెలియగానే జాతరకు వచ్చినట్లు జనం ఆ ఇంటి ముందుకు వచ్చి వాలారు. ఇంట్లో వాళ్లు కొడుతుంటే.. వాళ్లు కూడా ఇంట్లో వాళ్లతో చేరారు. అతడు కొట్టద్దొని ఎంత ప్రార్థించినా.. విడిచి పెట్టమని ప్రాథేయపడినా వాళ్లు కనికరించలేదు. మనిషిని కొట్టే అవకాశం ఇంకెప్పుడూ దొరకదన్నట్లు దొంగను చావకొట్టారు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.