‘ముక్కలు ముక్కలుగా నరకడం..’ ఈ మధ్య తరచూ వినిపిస్తున్న పదం ఇదే. ఢిల్లీ శ్రద్దా వాకర్ ఉదంతం మొదలుకొని నేటి వరకు నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నచ్చకపోతే తోటి వారిని వదిలేయడం మానేసి.. అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. అంతటితో ఊరుకుంటున్నారా! అంటే లేదు. ఆపై శవాలను ఛిద్రం చేస్తున్నారు. ఈ కోవకు చెందిందే ఈ వార్త కూడా. భార్య విచ్చల విడి తనాన్ని భరించలేకపోయిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను హత మార్చడమే కాకుండా.. అనంతరం ఆమె శరీరం నుండి తలను వేరుచేసి, శరీరాన్ని ముక్కలు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల కిందట చెరుకు పొలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. అప్పుడు మృతదేహానికి చేయి, కాలు, మొండెం లేకపోవడం వల్ల ఆమెను ఎవరనేది గుర్తించలేకపోయారు. తాజాగా ఈ కేసును ఛేదించిన పోలీసులు, మృతురాలి పేరు జ్యోతి అని, ఆమె భర్త పంకజ్ మౌర్యే నిందితుడని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, సీతాపూర్‌లోని లూనా గ్రామానికి చెందిన పంకజ్, జ్యోతి భార్యాభర్తలు. వీరి దాంపత్య జీవితం కొన్నేళ్లు సజావుగానే సాగింది. రాను.. రాను.. జ్యోతి మత్తు పదార్థాలకు అలవాటు పడింది. దీనికి తోడు గ్రామంలోని పరాయి మగాళ్లతో సంబంధం, ఇంటినుంచి పారిపోవడం చేసేది. ఈ విషయమై పంకజ్ ఆమెను పలు మార్లు హెచ్చరించాడు. కానీ, ఎప్పుడూ మత్తులో ఉండేది. ఈ విషయాలను పట్టించుకునేది కాదు.
దీంతో విసిగిపోయిన పంకజ్ ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 9న పంకజ్, అతడి స్నేహితులు కలిసి జ్యోతిని హత్య చేశారు. తర్వాత ఆమె శరీరం నుంచి తలను వేరు చేశారు. అనంతరం మొండెంతో పాటు ఇతర భాగాలను ముక్కలు చేశారు. వాటిని ఓ బస్తాలో వేసుకొని దగ్గరలోని అడవికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బస్తాను పడేశారు. మరికొంత దూరం వెళ్ళాక తలను రాయితో కొట్టి గుర్తు పట్టకుండా చేశారు. తర్వాత దాన్ని అక్కడే పడేశారు. కొన్నిరోజుల తర్వాత అటుగా వెళుతున్న కొంతమంది బస్తాలోంచి దుర్వాసన వస్తుండటం గమనించి.. దగ్గరకు వెళ్లి చూడగా అది ఓ శవం అని తేలింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అందులో తల లేకపోవటం గుర్తించి వెతకటం మొదలుపెట్టారు. దాదాపు 18 గంటలు కష్టపడి తలను వెతకి పట్టుకున్నారు. తర్వాత మిస్సింగ్ కేసుల ఆధారంగా చేసుకుని పంకజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.