భార్యా భర్తల మధ్య గొడవలు జరగడం సహజం. చిన్న చిన్న గొడవలకు రాత్రి తిట్టుకుని ఉదయం కల్లా మళ్ళీ కలిసిపోతారు. గొడవ మరీ పెద్దదైతే భార్య పుట్టింటికి వెళ్ళి భర్తపై కోపం తగ్గాక మళ్లి అత్తింటికి చేరుకుంటుంది. ఇక వివాహేతర సంబంధాలు, ఇతర కారణాలతో పెద్ద పెద్ద గొడవలు జరిగితే మాత్రం.., భర్తతో ఉండకుండా విడాకులు తీసుకుంటుంటారు. కానీ ఓ భార్య మాత్రం భర్తతో జరిగిన ఓ గొడవకు ఏకంగా ఊహించని డ్రామాకు తెరలేపింది. భార్య నాటకానికి బలైన భర్తకు కోర్టు ఏకంగా అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
బహ్రాయిచ్ పరిధిలోని జాంపూర్. ఇదే ప్రాంతానికి చెందిన కంధాయ్, రమావతి అనే భార్యాభర్తలకు 2006లో వివాహం జరిగింది. పెళ్ళైన కొన్నేళ్ల పాటు ఈ దంపతులిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు. అయితే ఈ దంపతుల మధ్య 2009లో చాయ్ విషయంలో చిన్న గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై చేయి చేసుకున్నాడు. ఇక మరుసటి రోజు నుంచే భార్య రామావతి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. చాలా రోజులు గడిచినా కూడా భార్య రమావతి జాడ మాత్రం కనిపించలేదు. దీంతో రమావతి కుటుంభికులు భర్తే చంపేశాడంటూ కేసు పెట్టి కంధాయ్ ని కోర్టుకు ఈడ్చారు.
ఇక 2017లో అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి 10 ఏళ్ల జైలు శిక్షవిధించింది. ఇక ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన కంధాయ్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి కంధాయ్ ఒంటరిగా ఉంటూ కుమిలిపోతుండేవాడు. అయితే ఈ క్రమంలోనే కంధాయ్ దగ్గరి బంధువైన ఒకతను ఏదో పని మీద ఇటీవల రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లే సరికి అతనికి రమావతి కనిపించింది. అందరూ చనిపోయిందని అనుకుంటుంటే ఈమె ఇక్కడ కనిపించడంతో ఇది నిజమా, అబద్దమా అనేది కాసేపు తేల్చుకోలేకపోయాడు.
రమావతి అని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని భర్త కంధాయ్ కు చేరవేశాడు. అలెర్ట్ అయిన భర్త.. భార్య బతికే ఉందని పోలీసులకు సమాచారాన్ని అందించాడు. రమావతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళా సంక్షేమ కేంద్రానికి తరలించారు. అనంతరం రమావతిని విచారిస్తూ.. ఇన్నాళ్లు చనిపోయినట్టు ఎందుకు నాటకం ఆడావని అడగడంతో ఆమె చెప్పిన సమాధానం విని అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చాయ్ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, నా పై చేయి చేసుకోవడంతో కోపంతో అతనిపై పగ పెంచుకోవాలనుకున్నానని చెప్పింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు రమావతి ఆడిన నాటకంలో పుట్టింటి వాళ్ల పాత్ర ఉండొచ్చేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా ఫేక్ డెత్ నాటకం అల్లి అన్యాయంగా భర్తకు పదేళ్ల జైలు శిక్ష పడేలా చేసిన రమావతి తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణానికి పాల్పడిన భార్య రమావతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.