ఎవరికైనా అన్యాయం జరిగితే.. దోషులకు శిక్ష పడాలని కోరుకుంటారు. కొందరు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పగ తీర్చుకోవాలని చూస్తారు. ఒక వ్యక్తి అలా అనుకోవడమే కాకుండా పగ తీర్చుకున్నాడు కూడా. ఆ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
పగలు, ప్రతీకారాలు అనే వాటిని సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా చూస్తూనే ఉంటారు. అయితే ప్రత్యర్థికి స్కెచ్ వేయడం, మాటేసి నరికేయడం అంటే మాత్రం సినిమాల్లోనే చూస్తుంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ నిజంగానే జరిగింది. తీస్తే పెద్ద సినిమా కూడా అవుతుంది. ఒక వ్యక్తి తన ప్రత్యర్థిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను జెయిల్లో ఉన్నాడు. అతనికి తెలియకుండా ఒక లాయర్ ని పురమాయించి.. అతనికి బెయిల్ వచ్చేలా చేసి.. బయటకు వచ్చిన తర్వాత మాటేసి హత్య చేశాడు. ఈ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. పైగా చంపిన వ్యక్తినే ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖేరీ జిల్లాలో జరిగింది. మితౌలీ ప్రాంతంలో లాలా(47) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడిని అతి సమీపం నుంచి తలపై మూడు రౌండ్లు పేల్చడంతో చనిపోయాడు. అది హత్య అని పక్కాగా తెలుస్తున్నా.. చేసింది ఎవరనేది తెలియరాలేదు. పోలీసుల విచారణలో మృతుడి వియ్యకుండు కాశీ కశ్యప్(50) హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అతను అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో విచారణ జరపగా పోలీసులు కూడా విస్తుపోయే ఒక స్టోరీ వెలుగు చూసింది. కాశీ కశ్యప్ 2020లో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను జైలుకు వెళ్తూ తన భార్య, కుమారుడు జితేంద్రను కుమార్తె మామ వాళ్ల ఇంట్లో వదిలి వెళ్లాడు.
కొన్ని రోజుల తర్వాత జితేంద్ర కనిపించకుండా పోయాడు. ఒక చెరువు వద్ద అతని మృతదేహం లభించింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉంటాడని భావించి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదు. అయితే 2021లో కాశీ భార్యకు- లాలాకు విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో ఆమె లాలా తన కుమారుడు జితేంద్రను హత్య చేసినట్లు కేసు పెట్టింది. పోలీసుల విచారణలో జితేంద్ర హత్యలో తల్లి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. అన్నయ్య వరసయ్యే లాలాతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. వాళ్లు ఏకాంతంగా ఉండగా చూశాడని జితేంద్రను గొంతు నులిమి చంపేశారు. ఆ విషయం కాశీ కశ్యప్ కు తెలిసింది. అతను జైలు డిసెంబర్ 2022 జైలు నుంచి విడుదల అయ్యాడు.
వచ్చిన దగ్గరి నుంచి తన కుమారుడి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన పథకం కూడా రచించుకున్నాడు. లాలాకి తెలియకుండా కాశీ ఒక లాయర్ ని ఏర్పాటు చేశాడు. అతనికి బెయిల్ వచ్చేలా చేశాడు. ఏప్రిల్ మొదటి వారంలో లాలాకు బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి కాశీ కశ్యప్ స్కెచ్ వేయడం ప్రారంభించాడు. గత శుక్రవారం లాలా పొలం నుంచి ఒంటరిగా వస్తున్న సమయంలో మాటు వేసి కాల్చి చంపి పరారయ్యాడు. కాశీనే ఈ హత్య చేసినట్లు తమకు ఆధారాలు లభించాయని చెప్పారు. పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కాశీ కశ్యప్ చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.