Crime News: తనతో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువతిని హత్య చేశాడో యువకుడు. ఇంటికి పిలిచి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రా జిల్లా నవ్‌నీత్ నగర్‌కు చెందిన ఆశిష్ తోమర్ అదే ప్రాంతానికి చెందిన కుష్భూను ప్రేమిస్తున్నాడు. ఇద్దరికీ పరిచయం ఉండటంతో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలోనే ఆశిష్ తన మనసులో ప్రేమను ఆమెకు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఇందుకు కుష్భూ ఒప్పుకోలేదు. మే 30న సోమ్‌వటి అమావాస్య రోజు ఆశిష్ కుటుంబం మొత్తం గంగా నదిలో స్నానానికి వెళ్లింది. ఆశిష్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఆ సమయంలో ఆశిష్, కుష్భూకు ఫోన్ చేశాడు. తన ఇంటికి రమ్మని అడిగాడు.
ఆశిష్ మాట కాదనలేక కూష్భూ అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ పెళ్లి గురించి ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి అతడు అడిగాడు. ఆమె కాదంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆశిష్, కుష్భూ చున్నీతోనే ఆమె గొంతును బిగించి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బెడ్డు కింద దాచి పెట్టాడు. 24 గంటలు గడిచాయి. శవం కుళ్లిపోయి ఆశిష్ గదిలోంచి వాసన రావటం మొదలైంది. ఆశిష్ తండ్రి ఆ వాసన ఏంటని ఆడిగాడు. అతడు సమాధానం చెప్పకపోవటంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఆశిష్ గదిని వెతగ్గా.. బెడ్డు కింద కుష్భూ మృతదేహం కనిపించింది. ఆ శవం గురించి కొడుకుని నిలదీశాడు. అశిష్ జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పాడు. తండ్రి కూడా కొడుక్కి అండగా నిలిచాడు. హత్య గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. శవాన్ని మాయం చేసే పనిలో పడ్డారు.
36 గంటల తర్వాత.. మే 31వ తేదీ రాత్రి శవాన్ని బైకు మీద ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి కాల్చేశారు. కాలిన శవం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కూతురి మిస్సింగ్‌పై కంప్లైంట్ ఇచ్చిన కుష్భూ తల్లిదండ్రుల్ని సంఘటనా స్థలానికి పిలిపించారు. కుష్భూ ముఖం, దుస్తులు పూర్తిగా కాలిపోకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆ శవం తమ కూతురిదేనని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలి కాల్ హిస్టరీ ఆధారంగా ఆశిష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడే నేరం చేసినట్లు రుజువైంది. ఆశిష్‌తో పాటు అతడికి సహకరించిన తండ్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vizianagaram: మరణించిన భర్త!.. తట్టుకోలేని ఇల్లాలు కుప్పకూలిపోయింది!