మీరు ఎలుకలను చంపుతున్నారా..? అయితే జాగ్రత్త. పొరపాటున మీరు ఎలుకను చంపే దృశ్యాలు కెమెరా కంట పడ్డాయంటే మీరు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇదిగో ఓ యువకుడు అలాంటి పాపానికి పూనుకొని అడ్డంగా బుక్కయ్యాడు. సదరు వ్యక్తి ఎలుకను ఎంతలా హింసించి చంపాడో తెలిస్తే.. మీరూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే అనకమానరు.
ఎలుకే కదా! చంపేస్తే ఏమవుతుందిలే అనుకునే వారందరికి ఈ కేసు ఓ హెచ్చరిక లాంటిది. ఓ ఎలుక పట్ల క్రూరంగా ప్రవర్తించి, దాని మరణానికి కారణమైన వ్యక్తిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు 33 పేజీలతో కూడిన ఛార్జిషీట్ దాఖలు చేసిన వ్యవహారం ఇది. బదౌన్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి గతేడాది నవంబర్‌లో.. ఓ ఎలుకను చంపాడు. ఎంతలా హింసించి చంపాడంటే.. ఎలుక నీళ్లలో పైకి తేలకుండా ఉండేందుకు దాని తోకకు ఇటుకకు కట్టి, కాలువలో ముంచి, ఊపిరాడకుండా చేసి చంపాడు. అయితే, ఈ తతంగాన్ని జంతు హక్కుల కార్యకర్త వికేంద్రశర్మ వీడియోగా చిత్రీకరించడంతో అతని పాపం బయటపడింది.
ఎలుక పట్ల అతడు క్రూరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఎలుకను బయటకు తీసి తాను కాపాడే ప్రయత్నం చేశానని, కానీ ఆ లోపు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం.. ఎలుక కళేబరాన్ని శవపరీక్ష నిమిత్తం తొలుత బదాయూలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా వారు అందుకు నిరాకరించారు. ఆ తరువాత దానిని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ)కు తీసుకెళ్లారు. పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఆ ఎలుక ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి, ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు తేల్చారు. ఈ క్రమంలోనే యూపీ పోలీసులు తాజాగా బదాయూ కోర్టులో నిందితుడిపై 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో అతడు దోషిగా తేలితే జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదా ఐపీసీ సెక్షన్ 429 కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది.. అని ఓ సీనియర్ న్యాయవాది తెలిపారు. ఈ విషయమై జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎలుకలంటే అంటే అందరికి చిన్న చూపు ఉండొచ్చు కానీ దానిని చంపిన విధానం జంతువులపై క్రూరత్వం కిందకు వస్తుందని తెలిపాడు. అందుకే తాను ఈ కేసు పెట్టారని, భవిష్యత్తులో మరొకరు ఇలాంటి హింసకు పాల్పడకుండా ఉంటారని ఆయన మీడియాకు వెల్లడించారు’.
మరోవైపు, మనోజ్ తండ్రి మథుర ప్రసాద్ మాట్లాడుతూ ఎలుకలను చంపడంలో అతని తప్పేమీ లేదన్నారు. అతని మట్టి పాత్రలను ఎలుకలు పాడు చేశాయని.. దీంతో అతను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడని పేర్కొన్నారు. ఎలుకను చంపితే చర్యలు తీసుకున్నప్పుడు మేకలు, కోళ్లు, కోడి గుడ్లను చంపే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. చేపలు, ఎలుకలను చంపే రసాయనాలను విక్రయించే వారి పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చూశారుగా.. ఏదైనా ప్రాణమే. కాదని హద్దుమీరారో.. హత్య కేసులో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
UP cops charge man with drowning a rat in drain
Police in UP have filed a chargesheet against the 30-year-old man from Budaun who was accused of allegedly killing a rat by tying it to a brick and drowning it in a drain last November.https://t.co/9U2y0pV0ok
— The Times Of India (@timesofindia) April 11, 2023