జెలెన్ స్కీ.. గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా.. రష్యా సేనలకు ఎదురునిలబడి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతర దేశాల నుంచి సహకారం అంతగా అందకున్నాగానీ ఉక్రెయిన్ ఆర్మీకి అండగా నిలిచి తానే ఓ సైనికుడిగా మారి రష్యా సేనలతో పోరాడాడు. దీంతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే జెలెన్ స్కీ కారు ప్రమాదానికి గురిఅయ్యాడు.. అన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాద విషయాన్ని స్వయంగా ఆయన ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్నెల్ల క్రితం మెుదలైన ఈ విధ్వంసం ఇంకా ఆగలేదు. ఉక్రెయిన్ తన పోరాటంతో రష్యాతో ఢీ అంటే ఢీ అంటూ.. పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడి కారు ప్రమాదానికి గురైంది. శత్రు దేశమైన రష్యా సేనలు.. ఆక్రమించుకున్న ఇజియం పట్టణాన్ని అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించాడు. ఇజియం నగరం నుంచి తిరిగి వస్తుండగా ఓ ప్యాసింజర్ కార్ జెలెన్ స్కీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ప్రస్తుతానికి జెలెన్ స్కీ ఆరోగ్యంగానే ఉన్నారని.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని అధికారి తెలిపారు. ఇక ప్యాసింజర్ కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హస్పిటల్ కు తరలించారని ఉక్రెయిన్ అధ్యక్ష ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ వెల్లడించాడు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు అనుమానాలకు దారితీస్తోంది. తమ దేశం అధ్యక్షుడు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో వారు సంతోషిస్తున్నారు. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.